Reading Time: 2 minutes
Vande Bharat Sleeper: బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం? ఏ రూట్‌లో నడుస్తుంది?

Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న కొత్త వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతికతను ఉపయోగించి బిఈఎమ్ఎల్ (BEML) ఈ రైలును అభివృద్ధి చేసింది. నారింజ (ఆరెంజ్), బూడిద (గ్రే) రంగుల కలయికతో ఉన్న ఈ సరికొత్త రైలు కెఎస్‌ఆర్ బెంగళూరు – ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ – ముంబై మధ్య నడవనుంది. దేశంలోనే ఇది రెండవ వందే భారత్ స్లీపర్ రైలు కావడం విశేషం. కాగా, దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలును జనవరి 2026 లో హౌరా – కామాఖ్య మధ్య ప్రారంభించారు. ఇది ప్రయాణ సమయాన్ని దాదాపు ఆరు గంటల వరకు తగ్గించింది).

బెంగళూరు – ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రూట్

బెంగళూరు – ముంబైలను కలుపుతూ కొత్త వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభమవుతుందని గతంలోనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా బెంగళూరు, హుబ్బళ్ళి-ధార్వాడ్ ప్రాంతం, బెల్గావి, పూణే – ముంబై మధ్య ప్రయాణించే ప్రయాణికులకు రైలు కనెక్టివిటీ, సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

ప్రస్తుతం ఈ రైలు తుది పరీక్షల (Final Testing) కోసం బెంగళూరులోని ఎస్‌ఎమ్‌విటి (SMVT) స్టేషన్‌లో ఉంచారు. సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) డాక్టర్ మంజునాథ్ కనమడి తెలిపిన వివరాల ప్రకారం, ఈ రైలు ఇంకా పూర్తిగా భారతీయ రైల్వేకు అప్పగించలేదు. ప్రస్తుతం BEML ఆధ్వర్యంలోనే తుది తనిఖీలు, పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని రకాల ట్రయల్స్, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాత ఈ రైలును అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు:

ఈ రైలులో ప్రయాణికులకు అత్యంత ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేలా డిజైన్ చేశారు. దీని ముఖ్యమైన ఫీచర్లు ఇవే:

  1. మొత్తం కోచ్‌లు: 16 కోచ్‌లు (11 థర్డ్ ఏసీ (3 Tier) కోచ్‌లు, 4 సెకండ్ ఏసీ (2 Tier) కోచ్‌లు, 1 ఫస్ట్ ఏసీ (1AC) కోచ్).
  2. ప్రయాణికుల సామర్థ్యం: మొత్తం 823 మంది ప్రయాణించవచ్చు (3 టెయిర్‌లో 611, 2 టెయిర్‌లో 188, ఫస్ట్ ఏసీలో 24 సీట్లు).
  3. వేగం: ఇది సెమీ హై-స్పీడ్ రైలు, గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు.
  4. మెరుగైన బెర్తులు: ప్రయాణికులు హాయిగా నిద్రించడానికి అనువుగా కుషనింగ్‌తో కూడిన ఎర్గోనామిక్ బెర్తులు.
  5. ఆటోమేటిక్ డోర్లు: రైలు వెలుపలి తలుపులు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. అలాగే కోచ్‌ల మధ్య సులభంగా నడవడానికి వెస్టిబ్యూల్స్ ఉన్నాయి.
  6. ప్రయాణ సౌకర్యం: అత్యాధునిక సస్పెన్షన్ వ్యవస్థ, రైలు లోపల శబ్దాలు రాకుండా (Noise Reduction) ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు.
  7. భద్రత: రైలు ప్రమాదాలను నివారించే దేశీయ సాంకేతికత ‘కవచ్’ (Kavach), అత్యవసర సమయాల్లో మాట్లాడటానికి ‘ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్’ ఇందులో ఉన్నాయి.
  8. పరిశుభ్రత: కోచ్‌లలో అధిక పరిశుభ్రతను నిర్వహించడానికి ప్రత్యేక డిసిన్ఫెక్టెంట్ (క్రిమిసంహారక) సాంకేతికత.
  9. లోకో పైలట్ క్యాబిన్: డ్రైవర్ క్యాబిన్‌లో అధునాతన కంట్రోల్స్, సేఫ్టీ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు.

ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా? తాజా రేట్ల వివరాలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి