Reading Time: < 1 minute
Indian Government Issues Notice To Meta Over Child Sexual Abuse Content Ads On Instagram

Instagram: సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM) ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta)కు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పిల్లల ఆన్‌లైన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను వివరణ కోరేందుకు సిద్ధమైంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను ప్రోత్సహించే ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా కనిపించాయనే అంశంపై ప్రభుత్వం సమాధానాలు కోరనుంది.

అనుచిత ప్రకటనలు ఎందుకు అనుమతించబడ్డాయి.? అవి ఎలా ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చాయి.? వాటిని అడ్డుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారనే అంశాలపై మెటాను ప్రశ్నించనున్నారు. అయితే ఈ అంశంపై మెటా నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని మీడియా నివేదికలు, దర్యాప్తు కథనాల ప్రకారం చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను ప్రచారం చేసే కొన్ని చెల్లింపు ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రదర్శితమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను టెలిగ్రామ్ ఛానెల్‌లకు మళ్లించి, అక్కడ అక్రమ కంటెంట్‌ను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల ఆమోద ప్రక్రియను దాటుకుని వినియోగదారుల ముందుకు రావడమే. దీంతో సోషల్ మీడియా సంస్థల బాధ్యత, కంటెంట్ పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు తమ ప్లాట్‌ఫామ్‌లలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై మెటా ఇచ్చే వివరణ, తదుపరి చర్యలు ఇప్పుడు కీలకంగా మారాయి.