
AP Gold Mining: ఆంధ్రప్రదేశ్‌లో బంగారు ఖనిజ నిక్షేపాల గుర్తింపు, తవ్వకాలపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు, వాటి అన్వేషణకు కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు.
ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు ఖనిజ తవ్వకాలు, ఉత్పత్తి కొనసాగుతుండగా, ఇప్పుడు అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా బంగారు నిక్షేపాల అన్వేషణపై గనుల శాఖ దృష్టి పెట్టింది. ఈ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాల ప్రక్రియను నాలుగు దశలుగా (జీ-1, జీ-2, జీ-3, జీ-4) చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.
జాతీయ ఖనిజ అన్వేషణ అభివృద్ధి నిధుల (National Mineral Exploration Trust – NMET) సహకారంతో ఈ అన్వేషణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తవ్వకాల ద్వారా బంగారు నిక్షేపాల పరిమాణం, నాణ్యతపై స్పష్టత వచ్చిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ రాష్ట్ర ఖనిజ రంగ అభివృద్ధితో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.