
నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో చోరీ అయిన అమ్మవారి వెండి కిరీటం, వెండి పట్టీ దొరికినట్లు ప్రకటించారు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల. జూలై 2వ తేదీ మీడియాతో మాట్లాడిన ఎస్పీ జానకీ షర్మిల.. దొంగతనం జరిగిన తీరు.. దోపిడీదారులను పట్టుకున్న వివరాలను వెల్లడించారు.
ఎంతో పవిత్రమైన బాసర ఆలయంలో పెద్ద వెండి కిరీటం దొంగతనం జరిగినట్లు కంప్లయింట్ వచ్చిందన్నారు. విచారణ చేపట్టగా.. ఇది అంతర్ రాష్ట్ర దొంగల పనిగా గుర్తించినట్లు వెల్లడించారు. దొంగతనం చేసినోళ్లను పల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనంద్ గా గుర్తించినట్లు వెల్లడించారు. రైల్వే సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీ చేయటం వీళ్ల ప్రత్యేకంగా వెల్లడించారు ఎస్పీ.
బాసర ఆలయంలో కొట్టేసిన వస్తువులను అమ్మటం కోసం రైలులో నాందేడ్ వెళుతుండగా పట్టుకున్నామని.. వారి నుంచి ఒక కిలో 220 గ్రాముల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీ స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల. బాసర ఆలయంలో చోరీ జరిగిన వెంటనే.. దొంగల గాలింపు కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. అత్యంత వేగంగా కేసును చేధించామని వివరించారామె.
ALSO READ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం..
చాలా తక్కువ సమయంలోనే ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకుని.. వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులను అభినందిస్తూ.. ప్రోత్సహకాలు అందించారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల.