Reading Time: 2 minutes
New Aadhaar App Launched Face Authentication Mobile Number Update And Qr Based Aadhaar Sharing

Aadhaar App Launched: ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 నుంచి పాత mAadhaar యాప్‌కు బదులుగా కొత్త ఆధార్ యాప్ (Aadhaar App)ను ప్రోత్సహిస్తూ వినియోగదారులను కొత్త ప్లాట్‌ఫామ్‌కు మార్చుతోంది. ఆధార్‌కు సంబంధించిన సేవలను మరింత సురక్షితంగా, పేపర్‌లెస్ విధానంలో అందించేందుకు ఈ కొత్త యాప్‌ను రూపొందించింది.

UIDAI వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త Aadhaar App ప్రారంభమైన ఐదు నెలల లోపే 3.1 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా వినియోగదారులు వేగంగా ఈ యాప్‌ను స్వీకరిస్తున్నారని సంస్థ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 40 లక్షల మంది తమ మొబైల్ నంబర్లను యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోగా.. 8.5 లక్షల మంది చిరునామా మార్పులను పూర్తి చేశారు.

మొబైల్ నంబర్, అడ్రస్ అప్‌డేట్:

కొత్త Aadhaar Appలో బాగా ఆకట్టుకునే అంశం ఏమిటంటే.. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను నేరుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించడం. దీంతో చిన్న మార్పుల కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.

ఫేస్ ఆథెంటికేషన్‌:

ఈ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వినియోగదారులు తమ గుర్తింపును డిజిటల్ పద్ధతిలో ధృవీకరించుకోవచ్చు. ప్రతిసారి ఆధార్ ఫోటోకాపీలను సమర్పించాల్సిన అవసరం లేకుండా సురక్షితంగా సేవలను పొందేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

QR కోడ్ ద్వారా ఆధార్ షేరింగ్:

కొత్త యాప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ QR కోడ్ ఆధారిత ఆధార్ షేరింగ్. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఆధార్ కార్డు ఫోటోకాపీలను అందించాల్సి వచ్చేది. ఇకపై అవసరమైన వివరాలను మాత్రమే QR కోడ్ ద్వారా సురక్షితంగా పంచుకునే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత సమాచారం అనవసరంగా ఇతరుల చేతికి చేరకుండా గోప్యత మరింత మెరుగుపడుతుంది.

బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్:

ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ బయోమెట్రిక్ వివరాలను ఒకే క్లిక్‌తో లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. అదనంగా e-Aadhaar డౌన్‌లోడ్, ఆథెంటికేషన్ హిస్టరీ పరిశీలన, ఆధార్ సేవ కేంద్ర అపాయింట్మెంట్ బుకింగ్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

హోటళ్లు, ఆస్పత్రుల్లో కూడా ఉపయోగం:

UIDAI ఈ యాప్‌ను కేవలం ఆధార్ నిర్వహణకే పరిమితం చేయకుండా రోజువారీ డిజిటల్ గుర్తింపు సాధనంగా అభివృద్ధి చేస్తోంది. హోటల్ చెక్-ఇన్‌లు, ఆస్పత్రి అడ్మిషన్లు, సందర్శకుల నిర్వహణ వ్యవస్థలు, ఈవెంట్ ఎంట్రీలు, గిగ్ వర్కర్లు, సేవా భాగస్వాముల ధృవీకరణ వంటి అనేక అవసరాలకు Offline Verification Seeking Entity (OVSE) QR కోడ్ స్కానింగ్ ద్వారా ఈ యాప్ ఉపయోగపడనుంది.