
భారతదేశంలో విదేశీ నిధులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు), ట్రస్టులు, మత, విద్యా, సామాజిక సంస్థల కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కఠిన నిబంధనలను అమలుచేయడానికి ముందుకొచ్చింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ( ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్– ఎఫ్‌సీఆర్‌ఏ) కింద తీసుకొచ్చిన తాజా నిబంధనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
ప్రభుత్వం వీటిని పారదర్శకత, జాతీయ భద్రత, విదేశీ నిధుల దుర్వినియోగ నివారణ కోసం తీసుకొచ్చిన చర్యలుగా చెబుతుండగా, మరోవైపు పౌరసమాజ సంస్థలు, క్రైస్తవ సంఘాలు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాలు ఇవి స్వచ్ఛంద సంస్థల స్వేచ్ఛను కట్టడి చేసే ప్రయత్నం అని విమర్శిస్తున్నాయి. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం చరిత్ర, దాని పరిణామం, తాజా మార్పులు, వాటి ప్రభావం అన్నింటినీ సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
భారతదేశంలో విదేశీ నిధుల ద్వారా రాజకీయ, మత, సామాజిక కార్యకలాపాలపై విదేశీ ప్రభావం పెరగకుండా ఉండేందుకు 1976లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ అనంతర కాలంలో విదేశీ సంస్థల ద్వారా రాజకీయ ప్రభావం పెరుగుతోందనే ఆందోళనల నేపథ్యంలో ఈ చట్టం రూపొందింది. తర్వాత కాలక్రమేణా ఈ చట్టంలో అనేక సవరణలు జరిగాయి.
2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పాత చట్టాన్ని రద్దు చేసి సమగ్ర కొత్త ఎఫ్‌సీఆర్‌ఏ2010 చట్టాన్ని అమలు చేసింది. అనంతరం 2020లో మోదీ ప్రభుత్వం కీలక సవరణలు తీసుకొచ్చి విదేశీ నిధుల వినియోగంపై మరింత కఠిన నియంత్రణలు విధించింది.
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్‌సీఆర్‌ఏ అమలులో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రభుత్వం ప్రకారం విదేశీ నిధులను అనేక సంస్థలు తాము ప్రకటించిన లక్ష్యాలకు భిన్నంగా వినియోగిస్తున్నాయని, మత మార్పిడులు, రాజకీయ ప్రభావం, సామాజిక అస్థిరత సృష్టించే కార్యక్రమాలకు నిధులు మళ్లుతున్నాయని విచారణల్లో తేలిందని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లలో సుమారు 18 వేలకుపైగా సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ నమోదు రద్దు చేయడమైనది. ప్రస్తుతం సుమారు 14,456 సంస్థలు మాత్రమే ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదు కలిగి ఉన్నాయని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.
తాజా నిబంధనల్లో ప్రధాన మార్పులు
కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటివరకు జీవితకాలంగా భావించిన నమోదు విధానాన్ని మరింత పరిమిత కాలానికి కట్టడి చేసేవిధంగా మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. నమోదును క్రమానుగతంగా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇకపై ప్రతి సంస్థ విదేశీ నిధులు ఏ దేశం నుంచి వస్తున్నాయి, ఏ ప్రాజెక్టుకు వినియోగిస్తారు.
ఏ రాష్ట్రం, జిల్లా, గ్రామంలో ఖర్చు చేస్తారు అనే పూర్తి వివరాలను ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాలి. అలాగే ఒక నిర్దిష్ట లక్ష్యంతో నమోదైన సంస్థ ఇతర కార్యకలాపాలు చేపట్టకూడదు. ఉదాహరణకు విద్యా సంస్థగా నమోదైతే రాజకీయ ప్రచారం లేదా మత ప్రచారం చేయరాదు. ప్రభుత్వం అనుమతించిన ప్రధాన విభాగాలైన విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక లేదా మత సంబంధిత కార్యకలాపాల పరిధిలో మాత్రమే విదేశీ నిధులను వినియోగించాలి.
మత మార్పిడులపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ప్రస్తావిస్తున్న అంశం మత మార్పిడులు. మత సంస్థలు తమ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కానీ విదేశీ నిధులను ఉపయోగించి ఇతర మతాల వారిపై ఒత్తిడి, ప్రలోభం లేదా ఆర్థిక ప్రయోజనాల ద్వారా మత మార్పిడికి గురిచేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తోంది. పాఠశాలలు, విద్యాసంస్థల్లో మత లేదా రాజకీయ ప్రచారం జరగకుండా చూడాలని కూడా కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి సంస్థ విదేశీ నిధులు ఇచ్చే దాతల వివరాలు, వారి చిరునామా, నిధుల పరిమాణం, ఖర్చు చేసిన ప్రాజెక్టుల వివరాలు, నిర్వహణ మండలి సభ్యుల సమాచారం ప్రభుత్వానికి అందించాలి. ప్రముఖుల పేర్లతో సంస్థలు నమోదై, వాస్తవానికి ఇతరులు నిర్వహిస్తే వారి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కనీసం ఇప్పటికే వచ్చిన నిధుల్లో గణనీయమైన భాగం ఖర్చు చేసిన తరువాతే తదుపరి విడత నిధులు తీసుకునే విధానాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విదేశీ ఫౌండేషన్‌లపై ఆరోపణలు
కొత్త నిబంధనల ప్రకారం విదేశీ నిధులతో పనిచేసే సంస్థలు భారతదేశ సార్వభౌమత్వం, జాతీయ భద్రత లేదా ప్రజా శాంతికి విరుద్ధంగా వ్యవహరించకూడదు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం, విదేశీ ప్రయోజనాలకు అనుకూలంగా మీడియా కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విమర్శకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది దేశ ప్రయోజనాల రక్షణ కోసం మాత్రమేనని వాదిస్తోంది.
ఫోర్డ్ ఫౌండేషన్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, జార్జ్ సోరోస్‌కు సంబంధించిన నెట్‌వర్క్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అనేక భారతీయ సంస్థలు నిధులు పొందుతున్నాయని ప్రభుత్వం పలు సందర్భాల్లో పేర్కొంది. అయితే ప్రతి విదేశీ నిధి దుర్వినియోగమే అని చెప్పడం సరైంది కాదని స్వచ్ఛంద సంస్థలు వాదిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, పరిశోధన, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో పనిచేసే అనేక అంతర్జాతీయ ఫౌండేషన్‌లు చట్టబద్ధంగానే నిధులు అందిస్తున్నాయని అవి చెబుతున్నాయి.
ప్రభుత్వ వాదన, ఆర్‌ఎస్‌ఎస్‌పై ప్రశ్నలు
ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తోంది. విదేశీ నిధులు దేశీయ రాజకీయాలపై ప్రభావం చూపకూడదని, మత మార్పిడులు, తీవ్రవాద అనుబంధాలు, వేర్పాటువాద కార్యకలాపాలు, అక్రమ ఆర్థిక లావాదేవీలు, లేదా ఇతర చట్టవిరుద్ధ సంస్థలకు నిధులు మళ్లే అవకాశాలను అడ్డుకోవడానికే ఈ నియంత్రణలు అవసరమని పేర్కొంటోంది.
కొన్ని విచారణల్లో విదేశీ నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చినందున పారదర్శకతను కట్టుదిట్టం చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. ఈ సందర్భంగా విమర్శకులు మరో అంశాన్ని కూడా
ప్రస్తావిస్తున్నారు. విదేశీ నిధులు స్వీకరించే ఎన్జీవోలపై కఠిన నియంత్రణలు ఉంటే, విదేశీ విరాళాలు స్వీకరించని సిద్ధాంత సంస్థలు లేదా అనుబంధ సంస్థల ఆర్థిక పారదర్శకతపై కూడా సమాన ప్రమాణాలు ఉండాలనే వాదన వినిపిస్తోంది.
ప్రజాస్వామ్యంలో సమతుల్యత అవసరం
విదేశీ నిధులపై నియంత్రణ ప్రతి సార్వభౌమ దేశం అమలుచేసే సహజమైన విధానమే. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, రష్యా, చైనా వంటి దేశాల్లో కూడా విదేశీ నిధులపై కఠిన చట్టాలు ఉన్నాయి. అయితే ఆ నియంత్రణలు జాతీయ భద్రతను కాపాడుతూ, అదే సమయంలో పౌర సమాజ స్వేచ్ఛను అనవసరంగా కట్టడి చేయకుండా ఉండాలి.
ప్రభుత్వం విమర్శలను దేశద్రోహంగా చూడకూడదు. స్వచ్ఛంద సంస్థలు కూడా చట్టబద్ధత, పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారశైలిని పాటించాలి. ఎఫ్‌సీఆర్‌ఏ తాజా నిబంధనలు నిజంగా పారదర్శకతను పెంచి విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికడతాయా? లేక పౌర సమాజంపై మరింత పరిపాలనా నియంత్రణకు దారితీస్తాయా? అనే ప్రశ్నకు సమాధానం రాబోయే కాలంలో ఈ చట్టం అమలు తీరే నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో జాతీయ భద్రత, పారదర్శకత, పౌర హక్కులు – ఈ మూడింటి మధ్య సమతుల్యతను కాపాడగలిగినప్పుడే ఇలాంటి చట్టాల అసలు ఉద్దేశం నెరవేరుతుంది.
– సీహెచ్‌వీ ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.