
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
- ఈ నెల 2న రాష్ర్ట వ్యాప్తంగా కాలేజీలు బంద్
- 15న బీసీ విద్యార్థుల చలో హైదరాబాద్
హైదరాబాద్, వెలుగు: పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ఈ బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను జాజుల శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, సీపీఐ సీనియర్ నేత అజీజ్ పాషా, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, విక్రమ్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన రూ. 7,000 కోట్ల ఫీజుల బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని రకాల స్కీమ్‌లను అమలు చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మాత్రం చెల్లించడం లేదని విమర్శించారు. పదివేల ర్యాంకు నిబంధనను తక్షణమే ఎత్తివేయాలని కోరారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా అమలు చేసే వరకు, బకాయిలన్నీ విడుదల చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బంద్‌కు మా మద్దతు: మధుసూదనాచారి
బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడుతోందని విమర్శించారు. ఫీజులు సకాలంలో అందకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని, మరికొందరు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 2న బీసీ జేఏసీ పిలుపునిచ్చిన కాలేజీల బంద్‌కు బీఆర్‌ఎస్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు అజీజ్ పాషా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బీసీ జేఏసీ చేస్తున్న ఈ ఆందోళనకు సీపీఐ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.