
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 8 కోట్ల మంది యాక్టివ్ మెంబర్స్ కోసం సరికొత్త రూల్స్ (EPF స్కీమ్, 2026) తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్స్ వల్ల ఉద్యోగులకు జీతంలో ఎంత మొత్తాన్ని పీఎఫ్ కింద దాచుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ దొరుకుతుంది.
1. పీఎఫ్ (PF) కటింగ్
ఇకపై నెలకు గరిష్టంగా రూ.15,000 జీతం (బేసిక్ పే) వరకు మాత్రమే 12% చొప్పున పీఎఫ్ కట్ చేయడం తప్పనిసరి. అంటే ఉద్యోగి జీతం నుండి నెలకు రూ.1,800 మాత్రమే పీఎఫ్ కింద కట్ అవుతుంది. ఒకవేళ మీ బేసిక్ జీతం ఎక్కువ ఉన్న లేదా నెలకు 1 లక్ష ఉన్నా సరే, మీరు కచ్చితంగా కట్టాల్సింది కేవలం రూ.1,800 మాత్రమే. ఒకవేళ మీకు రిటైర్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు దాచుకోవాలని ఉంటే..రూ.1,800 కంటే ఎక్కువ డబ్బులు పీఎఫ్ కింద కట్టవచ్చు దీన్ని వాలంటరీ పీఎఫ్ అంటారు. కానీ, అది పూర్తిగా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
గమనిక: ఉద్యోగి అదనంగా డబ్బులు దాచుకోవాలని అనుకుంటే, కంపెనీ (యజమాని) కూడా అంతే మొత్తం అదనంగా ఇవ్వాల్సిన రూల్ లేదు. అలాగే, ఈ అదనపు పీఎఫ్ కటింగ్‌ను ఉద్యోగులు లేదా కంపెనీలు ఎప్పుడైనా తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా ఆపేయవచ్చు. దీనివల్ల ప్రైవేట్ ఉద్యోగుల చేతికి వచ్చే జీతం పెరిగే అవకాశం ఉంది.
2. పాత మెంబర్లకు
పాత పీఎఫ్ స్కీమ్‌లో ఉన్న ఉద్యోగులందరూ ఈ కొత్త 2026 స్కీమ్‌లోకి ఆటోమేటిక్‌గా మారిపోతారు. ఎవరి సభ్యత్వానికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరికీ పీఎఫ్ ప్రయోజనాలు యధావిధిగా అందుతాయి.
3. డబ్బులు డ్రా చేసుకోవడం
పీఎఫ్ అకౌంట్ నుండి అడ్వాన్స్ డబ్బులు తీసుకోవడానికి ఇదివరకు ఉన్న 13 రకాల కేటగిరీలను తీసేసి, కేవలం 3కి తగ్గించారు:
1.అత్యవసర అవసరాలు: ఆరోగ్యం బాగోలేకపోవడం (మెడికల్ ఎమర్జెన్సీ), పిల్లల చదువులు ఇంకా పెళ్లిళ్లు.
2.ఇంటి అవసరాలు: ఇల్లు కొనడం, కట్టడం లేదా రిపేర్ చేసుకోవడం.
3.ప్రత్యేక పరిస్థితులు: ప్రభుత్వం గుర్తించిన ఇతర అత్యవసర సమయాలు.
ఈ మార్పు వల్ల పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే ప్రాసెస్ ఈజీ ఆవుతుంది. అలాగే ఏడాదిలో ఎక్కువ సార్లు డబ్బులు తీసుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది.
4. 100% డబ్బులు తీసుకోవచ్చు..కానీ
ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బును (ఉద్యోగి వాటా + కంపెనీ వాటా కలిపి) డ్రా చేసుకోవచ్చు. కానీ, భవిష్యత్తు లేదా రిటైర్మెంట్ అవసరాల కోసం కనీసం 25% డబ్బును ఎప్పుడూ అకౌంట్‌లోనే ఉంచాలి. మిగిలిన 75% వరకు పూర్తిగా వాడుకోవచ్చు.
►ALSO READ | మీ డ్రింకుల్లో ఎనర్జీ ఎక్కడుంది..? : రెడ్ బుల్ తో సహా అన్ని ఎనర్జీ డ్రింక్స్ కు నోటీసులు
5. కంపెనీలకు కొత్త రూల్స్
కంపెనీలు (యజమానులు) ఇకపై పీఎఫ్ నిబంధనలను మరింత పక్కాగా పాటించాల్సి ఉంటుంది. ఈ కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చిన 15 రోజుల్లోగా కంపెనీలు ఉద్యోగుల పూర్తి వివరాలతో కూడిన రిటర్న్స్‌ను (ఫారం Vలో) సబ్మిట్ చేయాలి. ఇందులో ఉద్యోగుల ఆధార్, పాన్ (PAN), యూఏఎన్ (UAN) నంబర్, పూర్తి జీతం, పీఎఫ్ జీతం వివరాలు కచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా, పాత పీఎఫ్ కేసులను, సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం మూడు ప్రత్యేక డ్రైవ్‌లను కూడా చేపడుతోంది.