
ఆయన ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు…! ఎక్కడి నుంచైనా చిటికేస్తే చాలు పనులు చకాచకా పూర్తయిపోతాయి. అయినా సరే ఆయన రోజూ టంచనుగా ఆఫీసుకు రావాల్సిందే..! ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి అంతకు రెట్టింపు విమర్శలు చేసే బాపతు కాదాయన. విమర్శకులకు కూడా తన పనితనంతోనే సమాధానం చెబుతారు. అనుభవం లేదు కదా ఈయనేం పీకుతాడులే అని కారుకూతలు కూసినవాళ్లు కూడా ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ చూసి ముక్కున వేలుసుకుంటున్నారు. ఇప్పటికే మీకు అర్థమైయ్యే ఉంటుంది కదా..ఇదంతా తమిళనాడు సీఎం దళపతి విజయ్ గురించే.
తమిళ రాజకీయాల్లో రెండు ద్రవిడ దిగ్గజాలను కాదని ఒక నటుడు అధికారం చేపట్టడం సామాన్యమైన విషయం కాదు. కానీ విజయ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 2024లో పార్టీ పెట్టినప్పుడు.. 2026 ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కేవలం కెమెరా ముందు నటించే నటుడికి పాలన ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం నెలలోనే విజయ్ తన చేతలతో అందరి నోళ్లు మూయించారు. పక్కా కార్పొరేట్ స్టైల్ డ్రెస్సింగ్… ఖచ్చితమైన పని వేళలు.. సంచలన నిర్ణయాలతో విజయ్ సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తున్నారు.
మొదటి రోజు నుంచే దూకుడు:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సుమారు ఆరు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన ప్రధాన ద్రవిడ పార్టీలను పక్కన పెట్టి ప్రజలు విజయ్ నాయకత్వానికి పట్టం కట్టారు. మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జిల్లా కలెక్టర్లు.. పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన నిర్వహించిన సమావేశం విజయ్ పాలనా దిశను స్పష్టం చేసింది. నేరస్థుల విషయంలో రాజకీయ జోక్యం లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సులను ఏసీ బస్సులుగా మారుస్తామన్న ప్రకటన సామాన్య ప్రజల్లోకి బలమైన సంకేతాన్ని పంపింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విజయ్ ప్రభుత్వం మొదటి రోజే దూకుడు ప్రదర్శించింది. ప్రజలు తనను నమ్మవచ్చని, అబద్ధపు వాగ్దానాలతో మోసం చేయనని ఆయన ప్రచారంలో చెప్పారు. అన్నట్టుగానే పదవి చేపట్టిన కొద్ది గంటల్లోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు 2.4 కోట్ల గృహ విద్యుత్ వినియోగదారులకు లబ్ధి చేకూరుతోంది. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ విభాగం నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే పనిచేసేలా నిబంధనలు రూపొందించారు.
మహిళలు, చిన్నారుల భద్రత కోసం విజయ్ ప్రభుత్వం సింగపెణ్ అంటే సింహభాగం అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన, తక్షణ పరిష్కారం ఈ విభాగం ప్రధాన ఉద్దేశం. అలాగే సామాజిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్న మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్లకు దగ్గరగా ఉన్న 717 మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. 500 మీటర్ల పరిధిలో ఉన్న ఇలాంటి దుకాణాలను తొలగించాలన్న నిర్ణయంతో దేవాలయాలు, మసీదులు, చర్చీల పరిసరాలు ఇప్పుడు ప్రశాంతంగా మారాయి.
విజయ్ నిర్ణయాలే కాకుండా ఆయన పని తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తమిళ రాజకీయ నేతలు వేసే తెల్లటి పంచెకు బదులుగా ఆయన సూట్ ధరించి సెక్రటేరియట్ కు వస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక ఆధునిక పరిపాలనా అధికారిలా కనిపించడం విజయ్ ప్రత్యేకత. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా ఆఫీసులో ఉంటున్నారు. సుమారు ఏడు గంటల పాటు డెస్క్ దగ్గరే గడుపుతూ ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. తన కోసం ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవడం, ఆఫీసులోనే నిశ్శబ్దంగా భోజనం ముగించడం వంటివి అధికారులకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలనే లక్ష్యం:
కేంద్ర ప్రభుత్వంతో విజయ్ అనుసరిస్తున్న తీరు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండానే కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోడీని కలిసి మేకదాటు ప్రాజెక్టు అడ్డుకోవడం, మత్స్యకారుల విడుదల వంటి అంశాలను బలంగా వినిపించారు. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అశోక్ కుమార్ లాహిరి.. విజయ్ ఆర్థిక విజన్‌ను ప్రశంసించడం ఒక పెద్ద సంచలనం. 2035 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థను 1.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న విజయ్ రోడ్ మ్యాప్ అద్భుతమని ఆయన కొనియాడారు. కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గానే కాకుండా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని మార్చే ప్రణాళికలు రూపొందుతున్నాయి.
పాలనలో పారదర్శకత కోసం విజయ్ ఒక విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఇందులో 35 విభాగాలకు సంబంధించి 436 అంశాలను పొందుపరిచారు. తిరుక్కురళ్ లోని పది సూత్రాల ఆధారంగా ఈ పాలనా ప్రణాళిక సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేయడం ద్వారా పారదర్శకతను చాటారు. అవినీతిని అరికట్టేందుకు సింగిల్ విండో పద్ధతిని విస్తరించడంతో పాటు విజిలెన్స్ దాడులను ప్రోత్సహిస్తున్నారు. అటు పేదల కోసం అమ్మ ఉనవగం క్యాంటీన్లను ఆధునీకరించి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు.
హిందూ మతపరమైన ఆస్తుల వినియోగంపై విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. గత ప్రభుత్వం ఆమోదించిన 245 కోట్ల రూపాయల విలువైన కమర్షియల్ ప్రాజెక్టులను ఆయన రద్దు చేశారు. దేవాలయ నిధులను వ్యాపార భవనాలకు కాకుండా భక్తుల సౌకర్యాలకే ఖర్చు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే సాంకేతికతను పాలనలో జోడించి సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్, వెట్రి తమిళనాడు సూపర్ యాప్ వంటివి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం ద్వారా పారదర్శకత పెంచాలని విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ హిట్‌లు అందుకున్న ఈ స్టార్.. ఇప్పుడు సెక్రటేరియట్ లో కూడా అదే స్థాయిలో పాలనా ముద్ర వేస్తున్నారు.
జనవరి 2024లో మొదలైన ఒక ప్రయాణం.. మే 2026లో అధికారంలోకి వచ్చి.. జులై 2026 నాటికి తన పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక నటుడు పరిపాలన చేయలేడన్న విమర్శలకు విజయ్ తన ఫైళ్లతో సమాధానం చెబుతున్నారు. ఈ ఉత్సాహం.. కొత్త ఒరవడిని ముందు ముందు కూడా కొనసాగిస్తారో లేదో చూడాలి…