
గత వారం జూన్ 28న(ఆదివారం) అర్ధరాత్రి టైంలో నాగ్‌పూర్‌లోని మంకాపూర్ రోడ్డులో ఉన్న ఓ గుడి దగ్గర చిన్న ట్రాఫిక్ గొడవ పెద్ద వివాదంగా మారింది. సాధారణ దుస్తుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసుపై ఎనిమిది మంది బైకర్లు దారుణంగా దాడి చేశారు. అతని కారును పగలగొట్టి, చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు.
సమాచారం ప్రకారం ఎం జరిగిందంటే… MIDC బ్రాంచ్‌లో పనిచేసే కునాల్ సింగ్ (35) అనే ట్రాఫిక్ పోలీసు, డ్యూటీ అయిపోయాక మార్టిన్ నగర్ కల్వర్టు మీదుగా కారులో ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో కొందరు యువకులు రోడ్డుపై ప్రమాదకరంగా (వంకరటింకరగా) బైకులు నడుపుతూ కారుకు అడ్డంగా వచ్చారు. వారిని హెచ్చరించడానికి కునాల్ సింగ్ హారన్ కొట్టారు. దీంతో ఆ బైకర్లు మొదట పక్కకు తప్పుకున్నా, వెంటనే మంకాపూర్ చౌక్ వైపు ఓవర్ స్పీడ్ లో వేగంగా వెళ్లారు.
అయితే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చేలోపే, బైకర్లలో ఒకరు కునాల్ సింగ్ కారు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. ఆ తర్వాత బైకర్లంతా కలిసి కారును అడ్డగించి, గుంపుగా చేరి బూతులు తిడుతూ ప్రాణాలతో వదిలేది లేదంటూ అతన్ని బెదిరించారు. అంతటితో ఆగకుండా కారుపై రాళ్లు విసిరి, వెనుక అద్దాన్ని పగలగొట్టి, బోనెట్ ధ్వంసం చేశారు. దాడి పై అడుగుదామని కునాల్ సింగ్ కారు దిగగానే, ఆ ముఠా అంతా కలిసి ఆయనపై దాడి చేసింది. ఈ దాడిలో ఆయన మెడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకోవడంతో ఆ బైక్ గ్యాంగ్ పారిపోయింది.
పోలీసుల యాక్షన్:
అక్కడ ఉన్న స్థానికులు కొందరు నిందితుల బైక్ నంబర్లను నోట్ చేసుకుని పోలీసులకు చెప్పారు. దీని ఆధారంగా మంకాపూర్ పోలీసులు వెంటనే కేసు (FIR) బుక్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, సాక్షుల సమాచారంతో మొత్తం 14 మంది నిందితులను పట్టుకున్నారు.
మంకాపూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ హరేష్ కల్సేకర్ మాట్లాడుతూ.. అరెస్ట్ అయిన 14 మందిలో ముగ్గురికి పాత నేర చరిత్ర ఉందని తెలిపారు. నాగ్‌పూర్‌లోని మార్టిన్ నగర్, మంకాపూర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి రోడ్ రేజ్ సంఘటనలు ఎక్కువవుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట ఒకే బైక్‌పై ట్రిపుల్ రైడింగ్, అమర్యాదగా ప్రవర్తించడం వల్లే ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాత్రి వేళల్లో గస్తీ (పెట్రోలింగ్) పెంచుతామని హామీ ఇచ్చారు. స్థానికులు మాత్రం ట్రాఫిక్‌ను మరింత కఠినంగా నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.