Reading Time: 2 minutes
Ind Playing 11 Vs Eng 2nd T20 Vaibhav Sooryavanshi In And Sanju Samson Out

IND Playing 11 vs ENG 2nd T20: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనున్న రెండో టీ20పై అందరి దృష్టి నిలిచింది. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతుండగా.. భారత జట్టులో మార్పులు ఉంటాయా?, ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి అంతర్జాతీయ అరంగేట్రం అవకాశం దక్కుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

వైభవ్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు:
ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ బెంచ్‌కే పరిమితమైన అతడికి.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు బుడ్డోడికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంలో వైభవ్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సంజు పేలవ ఫామ్:
టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ ఇటీవల మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 5, 0 పరుగులు మాత్రమే చేసిన సంజు.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవలం ఒకే పరుగు చేసి నిరాశపరిచాడు. అతడి ప్రతిభపై ఎలాంటి సందేహాలు లేకపోయినా.. నిలకడలేని ప్రదర్శన అతడికి ప్రతికూలంగా మారింది. దీంతో రెండో టీ20లో టీమ్ మేనేజ్‌మెంట్ మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజు స్థానంలో బుడ్డోడు ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శాంసన్‌ను పక్కనబెడితే వికెట్‌కీపర్‌గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఒక్క మార్పు మిన్నగా బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవు.

ఫామ్ అందుకున్న శ్రేయాస్, దూబే:
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అయితే ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు బ్యాట్ జులిపించాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతోనే బరిలోకి దిగింది. వీరిద్దరూ రెండో మ్యాచ్‌లో కూడా కొనసాగనున్నారు. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి జోడీ కీలక పాత్ర పోషించనుంది. అలాగే శివమ్ దూబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా.. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు సమతుల్యత తీసుకురానున్నారు. మొదటి మ్యాచులో దూబే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.

అందరి చూపు వైభవ్‌పైనే:
ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి రెండో టీ20లో అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా లేదా అనేది ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంజు శాంసన్ పేలవ ఫామ్, వైభవ్‌పై పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ అవకాశం లభిస్తే.. అంతర్జాతీయ వేదికపై వైభవ్ ఎలా రాణిస్తాడో చూడాలని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత్ అంచనా ప్లేయింగ్ ఎలెవన్:
వైభవ్ సూర్యవంశీ
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
తిలక్ వర్మ
శివమ్ దూబే
అక్షర్ పటేల్
హర్షిత్ రాణా
రవి బిష్ణోయ్
అర్ష్‌దీప్ సింగ్
వరుణ్ చక్రవర్తి