
వైద్య చరిత్రలో అరుదైనచికిత్స. ఉస్మానియా డాక్టర్లు మరోసారి రికార్డు సృష్టించారు. దేశంలోనే తొలిసారి ఒకేసారి ఒకే పేషెంట్ కు 5 అవయవాలను విజయవంతంగా (మల్టి విసెరల్)ట్రాన్స్ ప్లాంట్ చేశారు ఉస్మానియా డాక్టర్లు. కడుపు (Stomach), డ్యూడినమ్ (duodenum) ప్యాంక్రియాస్ (Pancreas), చిన్నపేగు (small bowel), పెద్దపేగు(Rt colon) అవయవాలను ఒకేసారి మార్పిడి చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ ను 36 గంటల పాటు నిరంతరాయంగా నిర్వహించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌కు ఈ అరుదైన ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా చేశారు.
ఉస్మానియా వైద్య బృందం సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను మరింత పెంచిందని అన్నారు. ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేసిన డాక్టర్లు,అనస్థీషియా, నర్సింగ్, క్రిటికల్ కేర్ సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యాధునిక, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఉస్మానియా డాక్టర్ల ఘనత నిదర్శనమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యున్నత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహా చెప్పారు.
►ALSO READ | ఉప్పల్ మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో తనిఖీలు.. నాన్ వెజ్ ఇలా స్టోర్ చేస్తే ఎలా తినేది..?