Reading Time: 2 minutes
Kohinoor Diamond History Explained Curse Syamantaka Facts

యుద్ధాలు జరిగాయి. సామ్రాజ్యాలు కూలిపోయాయి. రాజులు మరణించారు. హత్యలు జరిగాయి. అధికారం చేతులు మారింది. అయితే ఈ ఘటనలన్నింటికీ కారణం కోహినూర్ వజ్రమా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రమైన కోహినూర్‌.. అత్యంత వివాదాస్పదమైనది కూడా. ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్న పురుష పాలకులకు దురదృష్టమే ఎదురైందట.

ఇంతకీ ఈ వజ్రానికి నిజంగానే శాపం ఉందా? లేదా చరిత్రలో జరిగిన ఘటనలనే కాలక్రమంలో ఒక రహస్య కథగా మార్చేశారా? మరి శ్రీకృష్ణుడి శ్యామంతక మణికి, కోహినూర్‌కు నిజంగా ఏమైనా సంబంధం ఉందా? చరిత్ర ఒక కథ చెబుతోంది. ప్రజల విశ్వాసాలు మరో కథ చెబుతున్నాయి. ఈ రెండింటి మధ్య దాగి ఉన్న కోహినూర్ అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెలుగుల కొండ చరిత్ర ఏంటి?

కోహినూర్ అంటే పర్షియన్ భాషలో వెలుగుల కొండ అని అర్థం. కానీ ఈ వజ్రం ప్రయాణాన్ని చూస్తే అది వెలుగుల కంటే ఎక్కువగా రక్తపు మరకలనే మోసుకొచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క వజ్రం కోసం రాజులు యుద్ధాలు చేశారు. రాజ్యాలు కోల్పోయారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే కోహినూర్ చరిత్రను కేవలం ఒక వజ్రం కథగా కాదు. అధికార దాహం, యుద్ధాలు, ద్రోహాలు, రక్తపాతం కలిసిన చరిత్రగా కూడా చూస్తారు.

అయితే కోహినూర్ అసలు ఎక్కడ దొరికిందనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. అయితే ఎక్కువ మంది చరిత్రకారులు దీని మూలాలు భారత్‌లోని గోల్కొండ వజ్రాల గనులేనని భావిస్తున్నారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ వజ్రాలు ఇక్కడి నుంచే వెలికి వచ్చేవి. వాటిలో అత్యంత అరుదైన రత్నంగా కోహినూర్ పేరు తెచ్చుకుంది. ఇక ఇక్కడే పురాణ విశ్వాసాలు కూడా రంగంలోకి వస్తాయి. కొందరి నమ్మకం ప్రకారం కోహినూర్ అసలు శ్రీకృష్ణుడికి సంబంధించిన శ్యామంతక మణేనని చెబుతారు. మరికొందరు భాగవత పురాణంలోని కథనే దీనికి అనుసంధానం చేస్తారు. అయితే ఈ వాదనలను సమర్థించే ప్రత్యక్ష చారిత్రక ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు.

అందుకే చరిత్రకారులు వీటిని చారిత్రక వాస్తవాలుగా కాకుండా ప్రజల్లో ప్రచారంలో ఉన్న విశ్వాసాలుగానే చూస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం. కోహినూర్ చరిత్రలోకి వచ్చిన తర్వాత దాన్ని సొంతం చేసుకోవడానికి జరిగిన పోరాటాలు మాత్రం వాస్తవమే. ఢిల్లీ సుల్తానుల నుంచి మొఘల్ చక్రవర్తుల వరకు, పర్షియా పాలకుడు నాదిర్ షా నుంచి ఆఫ్ఘాన్ పాలకుల వరకు, అక్కడి నుంచి సిక్కు సామ్రాజ్యాధిపతి మహారాజా రంజిత్ సింగ్ వరకు ఈ వజ్రం చేతులు మారిన ప్రతిసారీ చరిత్రలో ఒక పెద్ద రాజకీయ మార్పు నమోదైంది.

అసలు కోహినూర్ అనే పేరు కూడా నాదిర్ షా నోటే మొదట వినిపించిందని చెబుతారు. 1739లో ఢిల్లీపై దండెత్తిన అతడు మొఘల్ ఖజానాను స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ వజ్రాన్ని చూసి వెలుగుల కొండ అని ఆశ్చర్యపోయాడని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ రత్నం కోహినూర్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ కోహినూర్ గురించి ఎక్కువగా వినిపించే కథ మాత్రం శాపం గురించే. ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్న ప్రతి పురుష పాలకుడూ చివరికి దురదృష్టాన్ని ఎదుర్కొన్నాడని ప్రచారం జరిగింది. అందుకే పురుషులు దీన్ని ధరించకూడదని కూడా కాలక్రమంలో ఒక నమ్మకం ఏర్పడింది.

చివరకు బ్రిటీష్‌ చేతికి వజ్రం:

అయితే ఈ కథకు కూడా చారిత్రక ఆధారాలు లేవు. ఒక విలువైన రత్నం కోసం జరిగిన యుద్ధాలు, రాజకీయ కుట్రలు, అధికారం కోసం జరిగిన పోరాటాలను తరువాతి తరాలు ఒక శాపం కథగా చెప్పుకుంటూ వచ్చాయని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే కోహినూర్ చరిత్రను చూసేటప్పుడు రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి చరిత్రలో నమోదైన వాస్తవాలు. రెండోది తరతరాలుగా ప్రజల్లో ప్రచారంలో ఉన్న విశ్వాసాలు. ఈ రెండిటిని చూసినప్పుడే కోహినూర్ ప్రపంచంలోనే అత్యంత మర్మమైన వజ్రంగా మారింది.

చివరకు రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత కోహినూర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి చేరింది. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లిన ఈ వజ్రం నేటికీ బ్రిటిష్ రాజకుటుంబ కిరీటంలో భాగంగానే ఉంది. అయితే దీన్ని తిరిగి భారత్‌కి తీసుకురావాలన్న డిమాండ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. కాబట్టి కోహినూర్ నిజంగా శాపగ్రస్తమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

అలాగే ఇది శ్రీకృష్ణుడి శ్యామంతక మణేనని నిరూపించే సాక్ష్యాలు కూడా లేవు. కానీ ఈ ఒక్క వజ్రం ప్రపంచ చరిత్రను, రాజకీయాలను, యుద్ధాలను, ప్రజల ఊహలను శతాబ్దాలుగా ప్రభావితం చేస్తూ వస్తోందన్నది మాత్రం తిరస్కరించలేని నిజం. అందుకే కోహినూర్ విలువ దాని బరువులో లేదు. దాని చుట్టూ అల్లుకున్న చరిత్రలో ఉంది.