
- మొత్తం 54.96 లక్షల మంది రైతులకు రూ.4,072 కోట్ల సాయం
రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 2 నుంచి 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న 10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,590.02 కోట్లను జమ చేసింది. ఈ నిధులు 26.50 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన రైతులకు అందాయని పేర్కొంది.
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 2 నుంచి 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న 10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,590.02 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఈ నిధులు 26.50 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన రైతులకు అందాయని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విడతల వారీగా రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు.
తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన 44.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను జమ చేసిన ప్రభుత్వం.. రెండో విడతలో 2 నుంచి 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు సాయాన్ని అందించిందన్నారు. ఈ రెండు విడతల ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 54.96 లక్షల మంది రైతులకు రూ.4,072.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మిగిలిన అర్హుల ఖాతాల్లోనూ విడతల వారీగా నిధులు జమ చేస్తామని ఆయన తెలిపారు.