
అత్యంత ఘోర ప్రమాదం.. పాకిస్తాన్ దేశంలో జరిగిన బస్సు యాక్సిడెంట్ ఇది. క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న ప్రయాణికుల బస్సు.. ఖైబర్ ప్రావిన్స్ లోని పఖ్తూన్ ఖ్వా ఏరియా మీదుగా వెళుతుంది. ఈ ప్రాంతం అంతా కొండలు, గుట్టలతో ఘాట్ రోడ్డు.
కొండ ప్రాంతం నుంచి వెళుతున్న బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బస్సు పెద్ద లోయలో పడిపోయింది. బాగా ఎత్తున్న కొండ పైనుంచి లోయలోకి పల్టీలు కొడుతూ పడింది. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అవ్వటమే కాకుండా ముక్కులు అయ్యింది.
ప్రమాదం సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 40 మంది స్పాట్ లోనే చనిపోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్తాన్ దేశంలోనే ప్రయాణికుల బస్సు ప్రమాదాల్లో ఇది ఘోరం అని అక్కడి మీడియా వెల్లడించింది.
ప్రమాదం తర్వాత ఆయా రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. లోయలో పడిన బస్సును భారీ క్రేన్ల సాయంతో.. తాళ్లతో బయటకు తీశారు. ప్రయాణికులను సైతం తాళ్లు కట్టి పైకి తీసుకొచ్చారు. సహాయ చర్యలు చేపట్ట సమయానికే బస్సులోని 40 మంది చనిపోయారని.. వీరిలో చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారని బలూచిస్తాన్ సీఎం సర్పరాజ్ మీడియా, రాజకీయ సలహాదారు షాహిద్ రింద్ ప్రకటించారు.
క్వెట్టా నుంచి బస్సు బయలుదేరినప్పుడు 36 మంది ఉన్నారని.. మార్గమధ్యలో మరికొంత మంది ఎక్కారని.. ప్రయాణికుల వివరాలు అన్నీ సేకరిస్తున్నామని వెల్లడించారాయన. రోడ్డు అధ్వాన్నంగా ఉండటం.. డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సు కండీషన్ లో లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు అక్కడి అధికారులు. గాయపడిన వారికి వైద్య సాయం అందిస్తున్నామని.. ఈ విషాధంపై పాకిస్తాన్ దేశం మొత్తం సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.