Reading Time: 3 minutes

వెళ్లినవాళ్లు వెళ్లినట్లే మాయం.. అడుగుపెడితే శవాలు కూడా దొరకవు.. ఈ మాయాద్వీపం వెనుక అంతుచిక్కని మిస్టరీ…

Caption of Image.

ఒక పెద్ద దీవి… అక్కడ ఏముంటుంది ? ఎవరుంటారు ? అనేది ఎవరికీ తెలియదు. కానీ, అక్కడికి వెళ్లినవాళ్లు మాత్రం తిరిగిరావడం కష్టం. అలాంటి ఒక దీవికి హీరో వెళ్లి అక్కడి రహస్యాన్ని కనుక్కుంటాడు. ఇలాంటివన్నీ హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. అలాంటి ఒక మాయాద్వీపం నిజంగానే ఒకటుంది. కానీ.. దీని రహస్యాన్ని ఇంకా ఎవరూ తెలుసుకోలేకపోయారు.

ఆనగనగా ఓ పెద్ద సరస్సు. అందులో ఒక ద్వీపం. అక్కడ ఏముందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ ద్వీపం లోపలికి వెళ్లి బతికి బయటపడిన వాళ్లు ఎవరూ లేరు. వెళ్లినవాళ్లు వెళ్లినట్టే మాయమైపోయారు. ఈ ద్వీపం ఉత్తర కెన్యాలోని రుడాల్ఫ్ సరస్సులో ఉంది. దాని పేరు ఎన్వైటెనెట్. ఈ పేరుకి సరస్సు పక్కన ఉండే స్థానిక తెగ ‘ఎల్ మోలో’ల భాషలో “నో రిటర్న్” అని అర్థం. ఈ ద్వీపం చాలా పెద్దది. దీని చుట్టు పక్కల ప్రాంతాల్లో అనేకమంది గిరిజనులు అడవి, అక్కడ ఉన్న సరస్సులను ఆధారంగా చేసుకుని బతుకుతున్నారు. కానీ.. ఈ దీవిలో మాత్రం మనుషులు ఉండడం లేదు. ఆ ద్వీపానికి శాపం ఉందని, అందుకే అక్కడికి వెళ్లినవాళ్లు చనిపోతున్నారని ఈ తెగ ప్రజలు నమ్ముతారు. అందుకే అటువైపు వెళ్లే సాహసం చేయరు.

అసలు ఏం జరిగింది?
చాలా ఏళ్ల క్రితం ఈ ద్వీపంలో కొంతమంది ఉండేవాళ్లని స్థానికులు చెబుతున్నారు. వాళ్లు చేపలు పడుతూ బతికేవాళ్లు. కొందరు ‘వేట’ మీద ఆధారపడి బతికేవాళ్లు. ఈ ద్వీపంలో ఉన్న గిరిజనులు బాగా నాగరికత తెలిసినవాళ్లు. ద్వీపం నుంచి బయటికొచ్చి, వ్యాపారాలు చేసేవాళ్లు. అలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత సడెన్ గా మెయిన్ ల్యాండ్ కు రావడం మానేశారు. దాంతో ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక ఊరివాళ్లు (ఎల్మాలో తెగవాళ్లు) ద్వీపానికి వెళ్లి చూశారు. అక్కడ జరిగింది చూసి ఆశ్చర్యపోయారు. ఆ ద్వీపమంతా నిర్మానుష్యంగా ఉంది. ఎంత వెతికినా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కాకపోతే అక్కడివాళ్ల గుడిసెలు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. గుడిసెల్లో వస్తువులు కూడా ఉన్నాయి. ఆరిపోయిన మంట దగ్గర కుళ్ళిపోతున్న చేపలు కనిపించాయి. గుంపుగా వెళ్లినా కూడా వాళ్లందరిలో భయం పుట్టుకుంది. వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చేయాలని డిసైడ్ అయ్యారు. పూర్తిగా ద్వీపం లోపలకి వెళ్లకుండానే, అక్కడివాళ్ల ఆచూకీ గురించి ప్రయత్నించకుండానే హుటాహుటిన తిరిగి ఊరికి వెళ్లిపోయారు. అప్పటినుంచి మరెవరూ అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు.

ALSO READ : లోయలో పడిన బస్సు నుజ్జు నుజ్జు

ఎక్కడికి వెళ్లారు?
ఎల్మాలోలు ద్వీపానికి వెళ్లినప్పుడు గుడిసెల్లో నిల్వ చేసిన ఉల్లిగడ్డలు, బాణాలు చూశారు. అంటే… ఇక్కడివాళ్లు ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్లిపోలేదు. ఒక వేళ అలా వెళ్తే గుడిసెలోని వస్తువులు కూడా తీసుకెళ్లేవాళ్లు. ఇంకెవరైనా దాడి చేసి చంపారా? అంటే శవాలు కనిపించాలి లేదంటే.. దాడి చేసిన గుర్తులు ఉండాలి. ఈ రెండూ అక్కడ లేవు. మరో విశేషం ఏంటంటే.. ఆ ద్వీపానికి వెళ్లొచ్చిన వాళ్లలో చాలామంది గాయపడ్డారు. మరికొందరు వికలాంగులు అయ్యారు, కొందరు చనిపోయారు. తిరిగి వచ్చేటప్పుడు గజ ఈతగాళ్ళు కూడా సరస్సులో మునిగిపోయారు. ఈ కారణాల వల్ల అక్కడివాళ్లకు ద్వీపం మీద భయం పెరిగింది. ఇంకొందరేమో ఆ ద్వీపంలో రాక్షసులు, నరమాంస భక్షకులు ఉన్నారని నమ్ముతున్నారు.

రీసెర్చర్లు ఏమయ్యారు?
ద్వీపం మిస్టరీ గురించి తెలుసుకున్న వివినా ఫష్ అనే బ్రిటిష్ రీసెర్చర్ చాలా ఆశ్చర్యపోయాడు. అసలు అక్కడేముందో తెలుసుకునేందుకు తన దగ్గర పనిచేసే ఇద్దరు రీసెర్చర్లు ఎం.షెప్లిస్, బి. దేసను 1935లో ద్వీపానికి పంపాడు. వాళ్లు ద్వీపానికి వెళ్లి, రీసెర్చ్ మొదలుపెట్టారు. ప్రతిరోజూ సాయంత్రం వాళ్లు సేఫ్ ఉన్నట్లు సిగ్నల్స్ కూడా పంపారు. సాయంత్రం కాగానే ద్వీపంలోని ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించేవాళ్లు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత, ‘అంతా బాగానే ఉంది. అక్కడ ఏ ప్రమాదమూ లేదు” అనుకుంటున్న టైంలో సడెన్గా సిగ్నల్స్ పంపడం ఆపేశారు. వారి నుంచి సిగ్నల్స్ కోసం రెండు వారాలు వెయిట్ చేశారు. అయినా.. రాకపోవడంతో వాళ్ల జాడ తెలుసుకోవడానికి చాలామంది ఆ ద్వీపానికి వెళ్లారు. తీరా వాళ్లు వేసుకున్న గుడారంలో చూస్తే షెప్లిస్, డేసన్లు అక్కడ లేరు. చుట్టు పక్కల వెతికినా లాభం లేకుండా పోయింది.  కనీసం వాళ్ల శవాలు కూడా దొరకలేదు. ఆ తర్వాత చాలాసార్లు ఆ ద్వీపంలో విమానాలతో గాలించినా వాళ్ల జాడ దొరకలేదు. స్థానికుల సాయం తీసుకుని, గుంపులు గుంపులుగా వెళ్లి చెట్టు, పుట్టా, రాయి.. ఇలా దేన్నీ వదలకుండా వెతికినా ఆ ద్వీపంలో అసలు మనుషుల జాడే కనిపించలేదు. వాళ్లు ఏమయ్యారు? జంతువులు తిన్నాయా? అంటే… ఏ జంతువూ దాడి చేయలేనంత స్ట్రాంగ్ గా గుడారం కట్టుకున్నారు. పైగా ఆ ద్వీపంలో జంతువులే లేవు. ఎవరైనా అడవిలో ఉండేవాళ్లు చంపారా? అంటే.. ఆ ద్వీపంలో మరో మనిషి జాడే కనిపించదు..

ఇతిహాసాల్లో 
అక్కడి ఇతిహాస గ్రంథాల్లో కూడా ఈ ద్వీపం ప్రస్తావన ఉంది. ద్వీపంలో కొన్ని పైపులు ఉన్నాయని. అవి నిటారుగా భూమి లోపలికి చొచ్చుకుని పోయి ఉన్నాయని చెబుతుంటారు. ఆ పైపుల నుంచి ఒక్కోసారి మంటలు చిమ్ముతాయని ఇక్కడివాళ్ళు
నమ్ముతున్నారు. ఎల్మాలో తెగ పెద్దలు చెప్పే కథల ప్రకారం… ద్వీపం ఎప్పుడూ పొగమంచుతో నిండి ఉంటుంది. ఆ ద్వీపంలో ఎవరికీ కనిపించని ఒక నగరం దాగి ఉంది. ఒక్కోసారి ఆ నగరం నుంచి వచ్చే కాంతి ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది. భూమి నుంచి ఆకాశానికి బంగారు ఆభరణాలు విసిరినట్టు తళతళా మెరుస్తుంటుంది. ఆ నగరంలో చాలా అద్భుతమైన టవర్లు ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్లు వినే శబ్దాలు ఆ నగరం నుంచే వస్తున్నాయని నమ్ముతున్నారు. కాకపోతే ఆ మ్యాజిక్ సిటీని ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. చూసిన వాళ్లు ప్రాణాలతో ఉండరని వాళ్ల నమ్మకం. 

ఆ సిటీ నుంచి వచ్చే శబ్దాలు విన్నవాళ్లు కొన్నాళ్లపాటు అనారోగ్యంతో బాధపడతారని చెబుతుంటారు. ఆ సౌండ్ విన్నవెంటనే తలనొప్పి వస్తుంది. తర్వాత బాడీ పెయిన్స్, కండరాల నొప్పులు వస్తుంటాయి. ఆ సౌండ్స్ గర్భిణీలు వింటే బిడ్డ పుట్టగానే చనిపోతుంది. అయితే… దీనికి మరో కారణం కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ వేడిని తట్టుకోలేక పిల్లలు చనిపోతారని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ శబ్దాలు ఎల్మాలోలను చాలా భయపెట్టాయి.. అందుకే ఇప్పుడు వాళ్ల మకాంని ఆ సరస్సు తీరం నుంచి పక్కనే అడవిలోకి మార్చేశారు. 

హాలండ్, జర్మనీలకు చెందిన రెండు టీంలు 20వ శతాబ్దం చివరలో అక్కడికి వెళ్లాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ రెండు టీంలు మిస్సయ్యాయి. వాళ్ల కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. కనీసం.. వాళ్ల ఆనవాళ్లు కూడా ఆ ద్వీపంలో లేవు.

అసలేం జరుగుతుందక్కడ?
ఎన్వైటెనెట్ ద్వీపంలో 1630కి ముందు చాలామంది ఉండేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. పెద్ద పెద్ద చెట్లు, వృక్ష సంపద, పెద్ద కొండ, పాలిష్ చేసినట్లుగా కనిపించే గోధుమ రంగు రాళ్ళతో చాలా అందంగా ఉంటుందీ ద్వీపం. అలాంటి ఈ ద్వీపంలో మనుషులు కనిపించకుండా పోవడానికి కారణాలు మాత్రం ఎవరికీ అంతుచిక్కడంలేదు. అయితే.. ప్రతి అమావాస్య రోజున ఈ ద్వీపం నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయని మెయిన్ ల్యాండ్లో ఉంటున్న ప్రజలు అంటున్నారు. అయితే.. అది ఆ శబ్దం జంతువేదైనా మూలగడం వల్ల వస్తుందా? లేక ఇంకేదైనా పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుందా? అనే విషయం అంతుపట్టడంలేదు. అంతేకాదు కొన్నేళ్లనుంచి ఎవరూ అందులోకి వెళ్లకపోవడంతో ద్వీపంలోని చెట్లు దట్టంగా పెరిగాయి. దానివల్ల ద్వీపంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు మనుషులు వెళ్లడానికి వీల్లేకుండా పోయింది.

  కరుణాకర్ మానెగాళ్ల

©️ VIL Media Pvt Ltd.