Reading Time: 2 minutes

Vijaya Mehta: రంగస్థల దిగ్గజ దర్శకురాలు కన్నుమూత.. ‘ఆమె కళ తరాలకు స్ఫూర్తి’ అని మోడీ ట్వీట్

Caption of Image.

ప్రముఖ నాటక దర్శకురాలు, నటి విజయా మెహతా (92) కన్నుమూశారు. మంగళవారం జూన్ 30, 2026న రాత్రి వయో సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. మరాఠీ నాటకరంగానికి కొత్త దిశను చూపిన ఆమె మరణంతో ‘నాటకరంగంలో ఓ శకం ముగిసింది’, ‘రంగస్థలం ఓ మహావృక్షాన్ని కోల్పోయింది’ అంటూ సోషల్ మీడియాలో ప్రముఖులు, కళాకారులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు భారతీయ రంగస్థలానికి సేవలందించిన విజయా మెహతా మరణం కళారంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

అయితే, నటి విజయ మరణించిన వార్త సినీ అభిమానులకు కాస్తా ఆలస్యంగా తెలిసింది. ప్రముఖ నటుడు, దర్శకుడు విజయ్ కేంక్రే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘రాత్రి 9:30 నుంచి 10 గంటల మధ్య ఆమె మరణించారు. ఆమె కుమార్తె ద్వారానే ఈ విషాద వార్త నాకు తెలిసింది. ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆమె నాకు గురువుతో సమానం,’అని కేంక్రే పేర్కొన్నారు. 1990 దశకంలో విజయా మెహతా రూపొందించిన టెలివిజన్ సిరీస్ ‘లైఫ్‌లైన్’కు ఆయన ముఖ్య సహాయకుడిగా పనిచేయడంతో పాటు, పలు ప్రాజెక్టుల్లో ఆమెతో సన్నిహితంగా పనిచేశారు.

ఆమె కళ ఎంతో స్ఫూర్తిదాయకం?: మోడీ ట్వీట్..

 విజయా మెహతా (Vijaya Mehta) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆధునిక మరాఠీ నాటకరంగానికి ఆమె మార్గదర్శకురాలని, భారతీయ సంస్కృతి, సినీ రంగంలో చిరస్మరణీయ వ్యక్తిత్వంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆమె సృజనాత్మకత, కళాత్మక నిబద్ధత అనేక తరాల నటులు, దర్శకులు, నాటక ప్రేమికులకు స్ఫూర్తినిచ్చిందని మోదీ తన సంతాప సందేశంలో తెలిపారు.

మహారాష్ట్ర గవర్నర్ సంతాపం..

ప్రముఖ నాటక దర్శకురాలు, నటి విజయా మెహతా మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన అసాధారణ ప్రతిభ, దార్శనికత, ప్రయోగాత్మక ఆలోచనలు, సృజనాత్మకతతో విజయా మెహతా మరాఠీ నాటకరంగాన్ని, భారతీయ సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని ఆయన కొనియాడారు. ఆమె నాటకరంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె వారసత్వం రాబోయే తరాల కళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే విజయా మెహతా కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నటి విజయా మెహతా సినీ ప్రస్థానం:

విజయా మెహతా 1934 నవంబర్ 4న బరోడాలో జన్మించింది. ప్రముఖ నటి నళిని జయవంత్, నటి-దర్శకురాలు-నిర్మాత శోభనా సమర్థ్ ఆమె మేనత్తలు కాగా, నూతన్, తనూజా ఆమెకు బంధువు. అయితే, తను  సినిమాలకన్నా.. నాటకాలనే ఎక్కువగా ఇష్టపడేది.

ఈ క్రమంలోనే భారతీయ నాటకరంగంలో కొత్త ప్రయోగాలకు నాంది పలికిన ‘రంగయాన్’ నాటక బృందాన్ని ప్రముఖ నాటక రచయిత విజయ్ టెండూల్కర్, నటుడు డాక్టర్ శ్రీరామ్ లాగూ, రంగస్థల కళాకారుడు అరవింద్ దేశ్‌పాండేతో కలిసి విజయా మెహతా సహ-స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మరాఠీ నాటకరంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చోటుచేసుకున్నాయి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన ‘ఏక్ శూన్య బాజీరావు’, ‘బారిస్టర్’, ‘హమీదాబాయిచి కోఠి’, ‘పురుష్’, ‘మహాసాగర్’, ‘శకుంతల్’ వంటి నాటకాలు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని భారతీయ రంగస్థల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

సినీ దర్శకురాలిగా కూడా విజయా మెహతా తనదైన ముద్ర వేశారు. ఆమె దర్శకత్వం వహించిన హిందీ చిత్రాలు ‘రావు సాహెబ్’ (1986), ‘పెస్టోంజీ’ (1988) విమర్శకుల ప్రశంసలు అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. నటిగా కూడా విజయా మెహతా పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 1984లో గోవింద్ నిహలానీ దర్శకత్వంలో వచ్చిన ‘పార్టీ’ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర విశేష ప్రశంసలు అందుకుంది. విజయా మెహతాకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.