Reading Time: 2 minutes
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం!

వానాకాలం వచ్చినా బాణుడు ఇంకా భగభగలాడుతూనే ఉన్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జూలై 6 నుండి జూలై 19 వరకు రెండు వారాల పాటు వేసవి సెలవులను రానున్నాయి. ఈ మేరకు కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు ఉన్న విద్యా సంస్థలకు ఇస్తున్నట్లు అక్కడి కాశ్మీర్ విద్యా డైరెక్టరేట్ (DSEK) ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం మళ్లీ జూలై 20న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అదే రోజు నుంచి యధావిధి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది.

వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా కాశ్మీర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు, విద్యార్థులు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి సకీనా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సెలవుల సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది సురక్షితంగా ఉండాలని కోరారు. విద్యార్థులు తగినన్ని నీళ్లు తాగాలని, ఎండ వేడిమి నుండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సమయాన్ని విశ్రాంతి, చదువు, కుటుంబంతో జరుపుకునే కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవాలని ఆమె ప్రోత్సహించారు.

కాగా ఎల్‌నినో కారణంగా దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు దేశమంతటా వ్యాపించినా వానలు మాత్రం అక్కడక్కడ కురుస్తున్నాయి. దీంతో వేసవిని తలపిస్తూ కాశ్మీర్‌ సహా ఉత్తర, దక్షిణాది రాష్టాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు వానలు వేళకు కురవక పోవడంతో రైతన్నలు ఆకాశం వైపు ఎప్పుడెప్పుడాని ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలకరి జల్లులకే పుకరించి మరికొందరు ఇప్పటికే విత్తులు నాటినా.. అవి మొలకెత్తడానికి అవసరమైన వానలు ఇంకా కురవక పోవడంతో ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షాలకు విద్యా సంస్థలు బంద్‌

మరోవైపు మహారాష్ట్రలో నెలకొన్న రుతుపవన పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పాల్ఘర్, రాయగడ్ పరిపాలనా యంత్రాంగాలు జూలై 1, 2 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, మాధ్యమి, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాయి. భారీ వర్షాల్లో విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. అయితే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తమ తమ పాఠశాలలకు లేదా కార్యాలయాలకు హాజరై, విపత్తు నిర్వహణ విధులను నిర్వర్తించడానికి, స్థానిక పరిపాలన జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి అందుబాటులో ఉండాలని సూచించింది.

అక్కడి భారీ వర్షాల కారణంగా పాల్ఘర్ జిల్లాలో ఉండి, పన్వెల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కాలేజీలకు జూలై 2న జరగాల్సిన అన్ని పరీక్షలను ముంబై యూనివర్సిటీ రద్దు చేసింది. పాల్ఘర్ జిల్లాలో, పన్వెల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాలేజీలకు జూలై 2, 2026న జరగాల్సిన అన్ని పరీక్షలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ పరీక్షల సవరించిన తేదీలను ముంబై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.