
CSK CEO on Hardik Pandya Trade for IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ విండోలో అతడి పేరు మార్మోగిపోతోంది. ముంబై ఇండియన్స్ తరఫున నిరాశాజనకమైన సీజన్ అనంతరం హార్దిక్ జట్టును వీడే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతడిని సొంతం చేసుకునేందుకు ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయని వార్తలు వచ్చాయి. అందులో ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా ఉందన్న ప్రచారం మరింత ఊపందుకుంది.
అయితే ఈ వార్తలపై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా జట్టులోకి తీసుకురావడంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ‘హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంపై ఇప్పటివరకు మా ఫ్రాంచైజీలో ఎలాంటి చర్చ జరగలేదు. సీజన్ సమీక్ష పూర్తయిన తర్వాతే ట్రేడ్‌లపై నిర్ణయాలు తీసుకుంటాం. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ముగిసిన తర్వాత మాత్రమే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది’ అని హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) టోర్నీ జూలై 18 వరకు కొనసాగనుంది. ఈ లీగ్‌లో సీఎస్‌కే అనుబంధ జట్టైన టెక్సాస్ సూపర్ కింగ్స్ కూడా పాల్గొంటోంది. అందుకే ఎంఎల్‌సీ ముగిసిన తర్వాతే ఐపీఎల్ 2027 సీజన్‌పై పూర్తి సమీక్ష నిర్వహించి, ట్రేడ్‌లపై నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మినహా మిగిలిన అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్ పాండ్యాపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చెన్నై, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని దక్కించుకునే రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
ఐపీఎల్ 2026లో సీఎస్‌కే ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. 2025లో చివరి స్థానంలో నిలిచిన చెన్నై.. 2026లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. వరుసగా మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడం, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్‌లో ఉండటంతో అతని నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుకు సీనియర్ కెప్టెన్ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత జట్టుకు కూడా నాయకత్వం వహించిన అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా సీఎస్‌కేకు సరైన కెప్టెన్ ఎంపిక కావచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గత ఏడాది కూడా సీఎస్‌కే భారీ ట్రేడ్‌లో భాగమైంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ చెన్నైకి రాగా.. రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టులోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా సీఎస్‌కే మరో సంచలన ట్రేడ్‌కు సిద్ధమవుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం మాత్రం హార్దిక్ పాండ్యాపై వస్తున్న వార్తలకు సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా బ్రేక్ వేసింది. అయితే సీజన్ సమీక్ష అనంతరం పరిస్థితులు ఎలా మారతాయో, హార్దిక్ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.