
విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా, ఎప్పుడూ కొత్తరకం కథలను ఎంచుకునే హీరో సత్యదేవ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘రావు బహదూర్’. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడు కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అమాంతం ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇక్కడ చూద్దాం.
మూవీ రివ్యూ: రావు బహదూర్
నటీనటులు : సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా, బాలా పరాసర్ తదితరులు
సంగీతం: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫర్: కార్తీక్ పర్మార్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్
ఎడిటర్, దర్శకత్వం: వెంకటేష్ మహా
కథ:
రావు బహదూర్ కథ 1969 నుంచి 1991 మధ్య కాలంలో జరుగుతుంది. రామప్ప అలియాస్ రావు బహదూర్ (సత్యదేవ్) ఒక సంస్థానానికి రాజు. వయసు పైబడిన దశలో ఆయన తన భవనంలో ఒక రకమైన విచిత్రమైన మానసిక సమస్యతో పోరాడుతుంటాడు. అయినప్పటికీ వైద్యులుకి సవాలు చేసేలా ప్రాణాలు పోకుండా బతుకేస్తుంటాడు. అదే సమయంలో తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి (ప్రతిక్ గాంధీ)కి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం చెబుతాడు రావు బహదూర్. అసలు అతన్ని పట్టి పీడిస్తున్న ఆ అనుమానం ఏంటి..? జీవితంలో అతను దేని కోసం ఆరాటపడుతున్నాడు..? రేణుక (దీపా థామస్) అనే అమ్మాయితో అతనికి ప్రేమ ఎలా చిగురించింది? వివాహం తర్వాత వాళ్ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ భార్యాభర్తలు ఇద్దరూ ఎందుకు మాట్లాడుకోకుండా వేర్వేరుగా బతుకుతున్నారు? తన మనసును తొలిచేస్తున్న ఒక పెద్ద అనుమానానికి చివరకు అతనికి సమాధానం దొరికిందా లేదా అనేది ఈ చిత్ర కథ.
కథనం:
సమాజంలో కులం, మతం, అంతస్తు లాంటివి మనుషులను ఎలా శాసిస్తున్నాయో ఈ సినిమాలో డైరెక్టర్ చాలా వివరంగా చూపించే ప్రయత్నం చేశారు. హోదా, రంగు, రక్తసంబంధాలు అనే సున్నితమైన అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ముఖ్యంగా ‘అనుమానం’ అనేది మనిషిని లోపలి నుంచి ఎలా దహించివేస్తుంది, మెదడులో పుట్టిన ఒక చిన్న సందేహం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుంది అనే పాయింట్‌ను దర్శకుడు చాలా బలంగా తెరపై చూపించారు. మన సమాజంలో వంశాన్ని నిలబెట్టడానికి ఒక వారసుడు కచ్చితంగా ఉండాలనే ఆచారం బలంగా నాటుకుపోయింది. సరిగ్గా ఇక్కడే హీరో రామప్పకు, చనిపోయిన తన రెండో కొడుకు అసలు తనకు పుట్టినవాడే కాదేమో అనే భయంకరమైన అనుమానం మొదలవుతుంది. దీనికి క్లారిటీ తెచ్చుకోవడానికి తన స్నేహితుడైన డాక్టర్ ఆచారి సాయంతో DNA టెస్ట్ కోసం హీరో ఒక పెద్ద నాటకం ఆడతాడు.
నిజం తెలిసిన తర్వాత వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే చనిపోయిన కొడుకు సమాధికి ఒక సొరంగం ఏర్పాటు చేయడం, అందులో అస్థిపంజరాన్ని చూపించడం, DNA పరీక్షల కోసం చేసే పనులు కాస్త సినిమాటిక్‌గా, సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. పెద్దల పట్టుదలల వల్ల వారసులు బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవడం, రాజరికపు అహంకారం ఎంత గుడ్డిగా ఉంటుందో డైరెక్టర్ తన మేకింగ్‌లో లోతుగా చర్చించారు. 1960ల కాలంలో ఉన్న కుల వివక్ష, 2020 వచ్చినా పోదు అని హీరో ఫ్రెండ్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. దర్శకుడు ఈ సినిమాను చాలా క్లాస్‌గా, మేధావులకు నచ్చేలా తీశాడు కానీ మాస్ సినిమాలు, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది కచ్చితంగా చెప్పలేం.
నటీనటులు:
నటుడిగా సత్యదేవ్ తన మార్క్ చూపించాడు. మరోసారి తన అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ఒకవైపు యువకుడిగా, మరోవైపు మానసిక సంఘర్షణ అనుభవించే వృద్ధుడిగా రెండు వేరియేషన్స్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా కొడుకు విషయంలో అనుమానపడే సన్నివేశాల్లో అతని కోపం, భయం, కసి అన్నీ ముఖకవళికల్లో అద్భుతంగా పలికించాడు. హీరోయిన్ దీపా థామస్ చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా, తన క్యారెక్టర్‌కు తగ్గట్టుగా బాగా నటించింది. హీరో స్నేహితుడిగా నటించిన వికాస్ ముప్పాల పాత్ర కూడా చాలా బాగుంది, సత్యదేవ్ తర్వాత స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించేది అతనే. హీరో కొడుకుగా చేసిన పిల్లోడు బాగానే ఆకట్టుకున్నాడు, మిగతా ఆర్టిస్టులు తమ పరిధి మేరకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
సాంకేతికంగా చూసుకుంటే స్మరణ్ సాయి అందించిన సంగీతం కంటే నేపథ్య సంగీతం చాలా బాగుంది. వింటేజ్ ఫీల్ తెప్పించేలా ఉంది. సినిమా ఆర్ట్ వర్క్ చాలా సహజంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ కార్మిక్ పర్మార్ తన కెమెరాతో 1960, 90ల వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. అప్పటి కాలానికి తగ్గట్లుగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. వెంకటేష్ మహానే ఈ సినిమాను ఎడిట్ చేసారు. అక్కడక్కడా కాస్త స్లోగా అనిపించినా బాగుంటుంది. దర్శకుడు కూడా తానే కాబట్టి ఎడిటింగ్ మైనస్‌లు ఏమైనా ఉన్నా వాటన్నింటినీ ఆయనే బాధ్యత తీసుకోవాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి, మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా రావు బహదూర్.. రెగ్యులర్ కాదు.. డిఫెరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!