Reading Time: 2 minutes
Otr Is Revanth Reddy Shifting Gears Telangana Cm Plans Early Election Strategy With Mass Outreach Tour

OTR: తెలంగాణ సీఎం గేర్ మార్చబోతున్నారా..? ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇకపై మరో ఎత్తు అంటున్నారా? పొలిటికల్‌ ప్రత్యర్థులకు చెక్‌ పెట్టేందుకు కొత్త స్కెచ్‌ సిద్ధం చేస్తున్నారా? దానికి సంబంధించిన బ్లూప్రింట్ ఇప్పటికే సిద్ధమైందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారన్నది నిజమేనా? ఇంతకీ ఏం చేయబోతున్నారు రేవంత్‌ రెడ్డి? దానికి సంబంధించి జరుగుతున్న చర్చలేంటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉన్నా… అప్పుడే ఎలక్షన్‌ మూడ్‌ వచ్చేస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు అదే తరహా ప్లానింగ్‌లో ఉన్నాయి. అందునా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎక్కడా తగ్గకూడదన్న ఉద్దేశ్యం కాంగ్రెస్‌ పార్టీలో, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలకు ఆయన పదును పెడుతున్నట్టు అనిపిస్తోందంటున్నారు.

ముఖ్యంగా పార్టీ ఎక్కడైతే బలంగా లేదో అక్కడి నుంచే మొదలు పెట్టాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారా ? ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి అక్కడి నుంచే యుద్ధం ప్రారంభించాలని సిద్ధమవుతున్నారా? అంటే… అవునన్నదే సమాధానం. ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో దీనికి సంబంధించిన చర్చలు గట్టిగానే నడుస్తున్నాయి. వచ్చే డిసెంబర్ నుంచి తన పొలిటికల్ స్కెచ్‌ని అమలు చేసే పనిలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు ఇప్పటినుంచి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ని రెండోసారి అధికారంలోకి తీసుకొస్తానని ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్‌ చేసుకునే పనిలో ఉన్నారన్నది పొలిటికల్‌ టాక్‌.

డిసెంబర్ తర్వాత పూర్తిగా గ్రౌండ్‌లోనే ఉండాలని రేవంత్‌ డిసైడ్ అయినట్టు కనపడుతోంది. అందుకోసం ప్రధానంగా ఉత్తర తెలంగాణ మీద ఫోకస్‌ పెట్టబోతున్నారట. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో ఆ విషయం నిరూపితమైంది కూడా. కానీ, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడుతున్నందున ఇక అక్కడ ఫోకస్ చేయాలన్నది సీఎం ప్లాన్‌గా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ నుండి తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేసే పనిలో భాగంగా బస్సు యాత్ర లేదంటే పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ పథకాల అమలు, రాజకీయ ఎత్తుగడల్ని అక్కడి నుంచే అమలు చేయాలని భావిస్తున్నారట.

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌, బీజేపీల కట్టడిని అక్కడి నుంచే మొదలుపెట్టాలనుకుంటున్నారట. ఓట్‌ బ్యాంకును పెంచుకోవడంతో పాటు…తన రెండున్నరేళ్ళ పాలన, గత బీఆర్‌ఎస్‌ పాలనపై చర్చకు పెట్టడంతో పాటు కేంద్రంలోని బీజేపీ తీరు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కూడా ప్రజలు మాట్లాడుకునేలా చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర నిర్వహించారు రేవంత్‌రెడ్డి. ఐతే ఈసారి కూడా పాదయాత్రే చేపడతారా? లేక బస్సు యాత్ర ఉంటుందా అన్న విషయంలో తర్జనభర్జనలు నడుస్తున్నాయంటున్నారు. ఫైనల్‌గా ఏది ఖాయమైనా.. యాత్ర మాత్రం ఫిక్స్‌ అన్నది సీఎం శిబిరం మాట.