
డబ్బులు పొదుపు చేసుకుని ఆదాయం పొందేందుకు దేశంలో అనేక మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, ప్రభుత్వం బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, పాలసీలతో పాటు ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా చాలానే ఉందుబాటలో ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో ప్రజలు తరచుగా పెట్టుబడి పెట్టడానికి భయపడుతుంటారు. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా కాస్త రిస్క్ ఉంటుంది. కానీ ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్‌లలో ఎలాంటి రిస్క్ ఉండదు. మీ డబ్బులకు కేంద్ర ప్రభుత్వ హామీ ఇస్తుండటంతో భద్రత ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వంలో మీరు ప్రతి నెలా కేవలం రూ.12,500 ఆదా చేస్తే 24 సంవత్సరాల్లో సులభంగా రూ. కోటి వరకు సంపాదించుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 24 ఏళ్లల్లో రూ.కోటి సంపాదించవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంలో వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఉదాహరణకు మీ వయస్సు ఇప్పుడు 25 ఏళ్లు అనుకుందాం. మీరు పీపీఎఫ్‌లో నెలకు రూ.12,500 పెట్టుబడి పెట్టాలి. అంటే సంవత్సరానికి రూ.1.50 లక్షలు జమ చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత మీకు 40 ఏళ్ళ వయస్సులో ఇది మెచ్యూర్ అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో మీరు మొత్తం రూ.22,50,000 జమ చేసి ఉంటారు. వడ్డీ రూపంలో మీకు రూ.18,18,209 లభిస్తుంది. అంటే ఒకేసారి రూ.40,68,209 అందుతుంది. పీపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ లేదా మెచ్యూరిటీ సొమ్ముపై ఎలాంటి పన్ను ఉండదు. దీంతో మొత్తం సొమ్ము నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
రూ.కోటి సంపాదించాలంటే..?
మీ పీపీఎఫ్ ఖాతా నుండి మీకు లభించే రూ.40,68,209ని మీరు ఖర్చు చేయకండి. దీనిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టండి. సంవత్సరానికి 12 శాతం సాధారణ దీర్ఘకాలిక రాబడి వచ్చినా.. ఈ డబ్బు కేవలం 9 ఏళ్లల్లో రూ. 1,10,92,315 అవుతుంది. ఈ విధంగా 24 సంవత్సరాల్లో మీరు రూ.1 కోటి సంపాదించవచ్చు. డబ్బులు పొదుపు చేసుకుంటూ దీర్థకాలంలో బాగా రాబడి పొందాలనుకునేవారికి ఇది మంచి మార్గంగా చెప్పవచ్చు. డబ్బులు పొదుపు చేసుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఎలా పొదుపు చేసుకోవాలి.. ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయాలు చాలామందికి తెలియవు.