Reading Time: 2 minutes

50 రోజుల్లోనే కోతకు వచ్చే అలసంద… కొత్త రకాన్ని అభివృద్ధి చేసిన హార్టికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు

Caption of Image.
  • పంట సాగుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర వ్యవసాయశాఖ

అధిక దిగుబడులు అందించడంతో పాటు కేవలం 50 రోజుల్లోనే కోతకు వచ్చే కూరబొబ్బర (అలసంద) కొత్త రకాన్ని హార్టికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పంట సాగుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆమోదం తెలిపింది. 

హైదరాబాద్, వెలుగు: అధిక దిగుబడులు అందించడంతోపాటు కేవలం 50 రోజుల్లోనే కోతకు వచ్చే కూరబొబ్బర (అలసంద) కొత్త రకాన్ని హార్టికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పంట సాగుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హార్టికల్చర్ వర్సిటీ విడుదల చేసిన తొలి కూరగాయల రకం ఇదే కావడం విశేషం. ఈ కొత్త రకం తొలి కోతకు కేవలం 50 నుంచి 55 రోజుల్లోనే సిద్ధమవుతుంది. 

ఇది పొద తరహా, కాంతి వ్యవధిపై ఆధారపడని లక్షణాలు కలిగి ఉండటంతో వానకాలం, యాసంగి సీజన్లలో సాగుకు అనువుగా ఉంటుంది. మొత్తం 85 రోజుల్లో ఎకరానికి సగటున 7 నుంచి 8 టన్నుల పచ్చి కూరబొబ్బర కాయల దిగుబడి అందిస్తుంది. కూరలు వండుకునేందుకు ఉపయోగించే ఈ రకం బొబ్బరకాయలు లేత ఆకుపచ్చ రంగులో 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పసుపు మొజాయిక్ వైరస్ ను తట్టుకునే సామర్థ్యం ఈ రకానికి ఉండటం మరో విశేషం. 

ఈ కాయల్లో దాదాపు 22 శాతం ప్రోటీన్ ఉండటంతో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతోపాటు ఫినాల్స్ శాతం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ పిడిగం సైదయ్య నాయకత్వంలో డాక్టర్ నిఖిల్, డాక్టర్ అనిత కుమారి, సుచిత్రతో కూడిన శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త రకం కూరగాయను అభివృద్ధి చేసింది.

మొదటి కూరగాయల రకం..

వర్సిటీ అభివృద్ధి చేసిన మొదటి కూరగాలయ రకం ఇది. ఈ కొత్త రకం కూరగాయలు తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులు అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటంతోపాటు ఏడాది పొడవునా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రైతులకు అధిక నికర లాభాలను అందించే సామర్థ్యం దీనికి ఉంటుంది. 
– డాక్టర్ దండా రాజిరెడ్డి, హార్టికల్చర్ వర్సిటీ వీసీ

©️ VIL Media Pvt Ltd.