
మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌లో శ్రీకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. బుధవారం ‘క్రష్’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘టీజర్ చూస్తుంటే ఎమోషనల్ ఫీల్‌తో ఆనందబాష్పాలు వచ్చాయి. ఒక మంచి సినిమా తీశారని అనిపించింది. ఇందులోని పిల్లల నటన చూశాక చాలామందికి నటనపై ఆసక్తి పెరుగుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.
ఈ పాట విన్నప్పుడు నా బాల్యంలోని స్మృతులు గుర్తుకువచ్చాయని డైరెక్టర్ ఆదిత్య హాసన్ చెప్పాడు. బాలల చిత్రాలు రావడం తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి సినిమాను ధీరజ్ నిర్మించడం హ్యాపీగా ఉందంటూ నిర్మాత ఎస్‌కేఎన్ బెస్ట్ విషెస్ చెప్పారు. చిత్ర దర్శకుడు శ్రీకర్ మాట్లాడుతూ ‘నోస్టాలజీ మూమెంట్స్‌ను గుర్తుచేసేలా పాటను డిజైన్ చేశాం. ఈ పాటను మళ్లీ మళ్లీ వింటున్నట్టుగా సినిమాను కూడా రిపీటెడ్‌గా చూస్తారు’ అని చెప్పారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘కథ వినగానే హ్యాపీ ఫీలయ్యా. ఓ మంచి సినిమా చేశామని అందరితో అనిపించుకుంటాం’ అని చెప్పారు. మాస్టర్ రోహన్ రాయ్, బాలనటి ఖుషి , మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, లిరిసిస్ట్ కిట్టూ విస్సాప్రగడ, సింగర్ అనురాగ్ కులకర్ణి, కొరియోగ్రాఫర్ లక్ష్మణ్, రైటర్ కొండల్ రావు, ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.