
Harish Rao : బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చర్చలకు సవాల్ విసిరి, తీరా సమయం వచ్చేసరికి మంత్రులు పారిపోతున్నారని ఆయన మండిపడ్డారు.
చర్చకు రాకుండా పారిపోయిన జూపల్లి
తెలంగాణ భవన్‌కు వచ్చి చర్చకు కూర్చుంటానని ప్రగల్భాలు పలికిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ తర్వాత మాట మార్చి చర్చకు రాకుండా తప్పించుకున్నారని హరీష్ రావు విమర్శించారు. తాము చర్చ కోసం తెలంగాణ భవన్‌లో అన్ని రకాల ఏర్పాట్లు చేసి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా, మంత్రి రాకుండా వెనుకడుగు వేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర అప్పుల విషయంలో జూపల్లి చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. నిన్నటివరకు రాష్ట్ర అప్పులు రూ. 8 లక్షల కోట్లు అన్న మంత్రి, నేడు రూ. 7 లక్షల కోట్లు అంటూ మాట మారుస్తున్నారని, ఆయనకు అంకెలపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
గురుకులాల టెండర్లలో రూ. 2,000 కోట్ల భారీ అవినీతి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు , గురుకుల పాఠశాలల టెండర్లలో దాదాపు రూ. 2,000 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారీ కుంభకోణంపై తాము నిలదీస్తున్నామని, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే ప్రభుత్వం వెనకాడుతోందని పేర్కొన్నారు.
పోలీసుల అండతో ప్రతిపక్షాల అరెస్టులు.. ప్రభుత్వ అసమర్థతకు అద్దం
గురుకులాల అవినీతి , రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి, నిలదీయడానికి వెళ్లిన తమ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ , తనను పోలీసులు అక్రమంగా అడ్డుకుని అరెస్ట్ చేయడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే చర్చకు సిద్ధమంటూ మొదట సవాలు విసిరే మంత్రులు, తీరా ప్రతిపక్షాలు నిలదీసేసరికి పోలీసులను ముందు పెట్టి అడ్డుకోవడం వారి అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. పోలీసుల వెనుక దాక్కుని పాలన సాగించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.