
ఆకుకూరలు బాగా దొరికే సీజన్ వర్షాకాలం. అవి తింటే బోలెడు పోషకాలు అందుతాయి. కానీ, చాలామంది ‘ఆకుకూరలా.. బాబోయ్ తినలేం’ అంటుంటారు. అలాంటి వాళ్లకు ఆకుకూరలతో వెరైటీలు చేసిపెడితే లాగించేస్తారు. పైగా ఇప్పుడు ఇక వానాకాలం కాబట్టి ఆకుకూరలతో శ్నాక్స్ చేసుకుని తింటే ఎంత బాగుంటుందో, అందుకే, ఆకుకూరలతో చేసే ఈ శ్నాక్స్, కొన్ని వంటకాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . !
మేతీ మటర్ పులావ్ తయారీకి కావాల్సినవి
- మెంతికూర: 100గ్రాములు
- నూనె: తగినంత
- బిర్యానీ ఆకు: రెండు
- లవంగాలు: నాలుగు
- యాలకులు: రెండు
- అల్లం తరుగు: టీస్పూన్
- వెల్లుల్లి తరుగు: టీ స్పూన్
- జీలకర్ర: టీ స్పూన్
- పచ్చిమిర్చి: మూడు
- పసుపు: కొద్దిగా
- బియ్యం: ఒక కప్పు
- బఠానీ: పావుకప్పు
- వేడినీళ్లు: రెండు కప్పులు
- ఉప్పు: తగినంత
మేతి మటర్ పలావ్ తయారీ విధానం..
ఒక గిన్నెలో నూనె వేడిచేసి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు. అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగించాలి. మెంతికూర వేసి నూనె పైకి వచ్చేవరకు మగ్గనివ్వాలి. తర్వాత గంటసేపు నానబెట్టిన బియ్యం వేసి నీళ్లు పోయేవరకు వేగించాలి. తర్వాత బఠానీలు వేసి వేడినీళ్లు పోసి మూత పెట్టి పావుగంట ఉడికించాలి. స్టవ్ కట్టేసి మరో పావుగంట కదపకుండా ఉంచి ఆ తర్వాత సర్వ్ చేస్తే పొడిపొడిగా ఉండే టేస్టీ మేతీ మటర్ పులావ్ అదిరిపోతుంది..
పాలకూర పునుగులు తయారీకి కావాల్సినవి
- బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యప్పిండి/
- కార్న్ ఫ్లోర్: రెండు టీ స్పూన్లు
- పుల్లటి పెరుగు: ఒక కప్పు.
- జీలకర్ర ఒక టీ స్పూన్
- ఉల్లిగడ్డ తరుగు: అరకప్పు
- అల్లం తరుగు: ఒక టీ స్పూన్
- పచ్చిమిర్చి: రెండు
- ఉప్పు: తగినంత
- క్యారెట్ తురుము: పావు కప్పం
- పాలకూర తరుగు: ఒక కప్పు
- నూనె: వేగించేందుకు సరిపడా
పాలకూర పునుగులు తయారీ విధానం
ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, బియ్యప్పిండి / కార్న్‌ఫ్లోర్ పెరుగువేసి అన్నీ బాగా కలిపి 30 నిమిషాలు పక్కనపెట్టాలి తర్వాత ఆ పిండిలో జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేయాలి. క్యారెట్ తరుగు, పాలకూర తరుగు వేసి బాగా కలపాలి. అవసరం అయితే ఒక టీ స్పూన్ నీళ్లు వేయాలి. కళాయిలో నూనె బాగా వేడిచేసి ఒక మాదిరి మంట మీద పునుగులు వేసి బాగా వేగిస్తే పాలకూర పునుగులు రెడీ.