Reading Time: 2 minutes

అభ్యర్థులకు గుడ్ న్యూస్ : త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు..డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు 

Caption of Image.
  • డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు 
  • సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్
  • ప్రస్తుతం రెండు, మూడు మండలాలకు ఒక సర్వేయర్
  • భూముల సర్వేకు రెగ్యులర్ సర్వేయర్లు కీలకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల సర్వే ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో దాదాపు 400 మంది రెగ్యులర్ సర్వేయర్ పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను సర్వే అండ్​ ల్యాండ్​ రికార్డ్స్​ శాఖ సిద్ధం చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం సీఎంఓ పరిశీలనలో ఉంది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే ఆర్థిక శాఖ అనుమతులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్వే సేవల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రిక్రూట్‌మెంట్‌ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

ఉన్న మండలాల్లో సగం ఇన్‌చార్జీలే..  

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 621 మండలాలు ఉండగా, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వేయర్ల సంఖ్య లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం సగం మంది మాత్రమే రెగ్యులర్ సర్వేయర్లు అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 1948 నాటికి సుమారు 40 లక్షలుగా ఉన్న సర్వే నంబర్లు ప్రస్తుతం 2 కోట్ల 29 లక్షలకు పెరగడంతో పనిభారం తీవ్రమైంది. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం ప్రతి రెండు లేదా మూడు మండలాలకు కలిపి ఒకే ఒక్క సర్వేయర్ ఇన్‌చార్జిగా వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో ఒక మండలంలో సర్వే పనులు జరుగుతున్నప్పుడు, మిగిలిన మండలాల్లోని అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. భూముల సరిహద్దుల లెక్కింపు, సబ్ డివిజన్ పనుల కోసం దరఖాస్తు చేసుకున్న సామాన్య ప్రజలు సుదీర్ఘకాలం వెయిట్ చేయాల్సి వస్తోంది. ఈ పనిభారం సర్వే క్వాలిటీపై కూడా ఎఫెక్ట్ చూపుతోందని, అందువల్ల కొత్త పోస్టుల భర్తీ అనివార్యంగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

త్వరలోనే భూముల రీ-సర్వే.. టెక్నాలజీతో పనులు

రాష్ట్రంలో 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను సెలెక్ట్ చేసి భూముల రీ-సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా దశల వారీగా మొత్తం భూములను సమగ్రంగా రీసర్వే చేయాలని భావిస్తోంది. నిజాం కాలం నాటి పాత నక్షాలు లేని 378 గ్రామాల్లో ఇప్పటికే 5 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, మిగిలిన 373 గ్రామాల్లో లేటెస్ట్​టెక్నాలజీతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ రీ-సర్వే ప్రాసెస్ లో గొలుసులు, టేపుల వంటి పాత పద్ధతులకు స్వస్తి పలికి డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఇప్పటికే 411 రోవర్స్ కొనుగోలు చేయగా, త్వరలోనే మరో 400 రోవర్లను సేకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సేకరించిన సమాచారాన్ని భూ భారతి పోర్టల్‌లో నమోదు చేసి, ఇంటిగ్రేటెడ్​ భూ భారతి చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్​ను తప్పనిసరి చేయనున్నారు.

లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఉన్నట్టా.. లేనట్టా !

భూముల సర్వేకు రెగ్యులర్​ సర్వేయర్లకు తోడు లైసెన్స్‌డ్ సర్వేయర్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఎక్కడా కూడా వారిని వాడుకోవడం లేదు. గత ఏడాది మే లో నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకున్నారు. వీరికి ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించి విధుల్లోకి చేర్చుకున్నారు. ప్రతి మండలానికి నలుగురి నుంచి ఆరుగురు సర్వేయర్లను కేటాయించారు. అయితే, విధుల్లోకి చేరి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసలు వీరు ఏ పరిధిలో పనిచేయాలి? ఏయే రికార్డులను పరిశీలించాలనే దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్టమైన ‘జాబ్ చార్ట్’ ఖరారు చేయలేదు. 
 

©️ VIL Media Pvt Ltd.