Reading Time: 3 minutes
Story Board Over Bjp

తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం చేస్తామంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కానీ ఎమ్మెల్యే స్థాయి నుంచి నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి వెళ్లిన నబీన్.. తెలంగాణలో పరిస్థితుల గురించి అవగాహనతోనే మాట్లాడుతున్నారా.. లేదా అనే చర్చ జరుగుతోంది. దేశంలో పన్నెండేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అలాగే మూడొంతుల రాష్ట్రాలు కాషాయ పార్టీ నీడలోనే ఉన్నాయి. కానీ తెలంగాణను మాత్రం బీజేపీ టచ్‌ చేయలేకపోతోంది. లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీల గెలుపు బలం అనుకుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవటాన్ని ఎలా తీసుకోవాలో మొదట బీజేపీ ఆలోచించుకోవాలి.

బెంగాల్‌ గెలుపుతో బీజేపీలో జోష్ మిన్నంటుతోంది. అందుకే తెలంగాణకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. ఇక్కడ కూడా బెంగాల్ తరహా రాజకీయం చేస్తామంటున్నారు. అసలు ఓ రాష్ట్రంలో పనిచేసిన వ్యూహం.. మరోచోట ఎలా పనిచేస్తుందనేది తేలాల్సిన విషయం. దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలనేది బీజేపీ లక్ష్యం. అందుకు అనుగుణంగానే ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో పాగా వేస్తూ వెళ్తోంది. చివరకు అత్యంత కఠినమైన లక్ష్యంగా భావించిన బెంగాల్లోనూ బీజేపీ అధికారంలోకి రాగలిగింది. దీంతో ఈ ఊపులోనే తెలంగాణలో కూడా అధికారం దక్కించుకోవాలని పిలుపునిచ్చిన.. కాషాయ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అంతటితో ఆగలేదు. తెలంగాణలోనూ బెంగాల్ తరహా రాజకీయం చేస్తామని ప్రకటించారు.

ఇక్కడ బెంగాల్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలూ వేటికవే భిన్నం. ఎక్కడి రాజకీయ వ్యూహాలు అక్కడే పనిచేస్తాయి. అంతేకానీ బెంగాల్ తరహా రాజకీయం.. ఇక్కడెలా చేస్తారనేది నితిన్ నబీనే చెప్పాలి. పైగా బెంగాల్లో టీఎంసీ నుంచి ఓ నేతను తెచ్చుకుని.. రాజకీయం చేసి.. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది బీజేపీ. కానీ తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు పాతిక, ముప్ఫై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ తరుణంలో బెంగాల్ తరహా రాజకీయం పేరుతో నితిన్ నబీన్.. పరోక్షంగా గతంలో మోడీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుకుతెస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి.

నితిన్ నబీన్ ఎమ్మెల్యే స్థాయి నుంచి నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలోకి వచ్చారు. ఆయనకు తెలంగాణలో రాజకీయ స్థితిగతులు, ఇక్కడి బీజేపీ పనితీరు గురించి అవగాహన ఉందా.. లేదా అనేది మరో చర్చ. తెలంగాణలో బీజేపీ ఎందుకు పుంజుకోవడం లేదో ఆలోచించకుండా.. ఇక్కడ బెంగాల్ తరహా రాజకీయం చేస్తామంటూ మాట్లాడటం ఏంటో ఆయనకే తెలియాలి. ఎవరేమనుకున్నా.. తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ఆకాంక్షలకు, రాష్ట్ర పార్టీ పనితీరుకు చాలా తేడా ఉంది. అసలు జాతీయ నేతలకు, రాష్ట్ర స్థాయి నేతలకు ఈ గ్యాప్ ఎందుకొచ్చిందో ముందు తెలుసుకోవాలి. ఆగ్యాప్‌ను వీలైనంత త్వరగా పూడ్చుకున్న తర్వాతే.. తెలంగాణలో ఏ తరహా రాజకీయం చేయాలో ఆలోచించుకోవచ్చు.

అదీ కాకుండా ప్రతిసారీ ఓ రాష్ట్రంలో బీజేపీ గెలవగానే.. వెంటనే తెలంగాణ వచ్చే ఆ పార్టీ జాతీయ నేతలు.. ఆ రాష్ట్రం తరహాలో ఇక్కడ రాజకీయం చేస్తి.. గెలిచేస్తామనడం పరిపాటి అయిపోయింది. చివరకు తెలంగాణ ప్రజలు కూడ ఇది రెగ్యులర్ డైలాగే కదా అనుకోకముందే జాగ్రత్తపడాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. అసలు తెలంగాణలో తెలంగాణ తరహా రాజకీయం చేయాలే కానీ.. బెంగాల్ తరహా రాజకీయం ఎలా చేస్తారనే రాజకీయ సందేహాలూ వస్తున్నాయి. మొదట రాష్ట్రంలో బీజేపీ రాజకీయ వ్యూహంపైనే క్యాడర్లో చాలా అనుమానాలున్నాయనే సంగతి నితిన్ నబీన్ దాకా చేరిందా.. లేదా అనేది మరో ప్రశ్న.

తెలంగాణలో ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్న బీజేపీ.. చివరకు అనుకున్న ఫలితం సాధించలేక చతికిలపడుతోందనే వాదన లేకపోలేదు. పైకి అధికారమే లక్ష్యం అని చెబుతున్నా.. లోపాయికారీ రాజకీయం అలాగే జరుగుతుందా.. లేదా అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇక్కడ తెలంగాణ ప్రజలేమనుకుంటున్నారనే సంగతి పక్కనపెడితే.. కనీసం క్యాడర్ అయినా అధికారమే లక్ష్యం అనే మాటను చిత్తశుద్ధిగా నమ్ముతోందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంతెందుకు కొన్నాళ్ల క్రితం రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలే హస్తిన వెళ్లి.. మన రాజకీయ వ్యూహమేంటని జాతీయ నేతల్ని అడిగి చీవాట్లు తిన్న విషయం ఇంకా అందరి స్మృతిపథంలో నుంచి చెరిగిపోలేదు. ఇంతటి అయోయమ స్థితిని క్లియర్ చేయకుండా.. అధికారం ఎలా వస్తుందో.. నితిన్ నబీనే చెప్పాలి.

నిజానికి తెలంగాణలో బీజేపీ చెప్పే మాటలకూ, చేసే చేతలకూ పొంతన లేదనే విమర్శలు వచ్చేలాగే ఆ పార్టీ వ్యవహారం ఉంటోంది. చివరకు రాష్ట్ర పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నేతలు కూడా కన్ఫ్యూజ్ అయ్యేలా పార్టీ పనితీరు ఉంటోందనే అభిప్రాయాలున్నాయి. అధికారం కోసం మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఎంత కసిగా పనిచేస్తోందో.. తెలంగాణలో కూడా అదే కసితో పనిచేస్తోందా.. అంటే లేదనే చెప్పాలి. అదేమంటే దానికి సవాలక్ష కారణాలు అంతర్గతంగా చెబుతారు. మొదట ఈ దుస్థితి నుంచి పార్టీని బయటపడేయటం.. నితిన్ నబీన్ తక్షణ కర్తవ్యం కావాలి.

తెలంగాణలో రాజకీయ స్థితిగతులు, ఇక్కడి జనం ఆకాంక్షల గురించి బీజేపీకి అవగాహన లేదనుకోవటానికి లేదు. ఆ పార్టీకి జరిగిన చరిత్ర మొత్తం తెలుసు. అయినా సరే చేసిన పనులు చెప్పుకోలేక.. ఏం చేస్తామో క్లారిటీ ఇవ్వలేక.. ఎన్నికల్లో బొక్కబోర్లా పడుతోంది. కొన్నిసార్లు బీజేపీ గెలుపే లక్ష్యంగా చాలా క్రియాశీలకంగా దూసుకెళ్లి.. మళ్లీ ఆఖరి మెట్టుపై సడెన్‌గా స్లో చేయడం కూడా ఎన్నో అనుమానాలకు తావిచ్చిన మాట వాస్తవం. ఇప్పటికైనా నితిన్ నబీన్ బెంగాల్ తరహా రాజకీయం అనే ప్రకటనలు కాకుండా.. వాస్తవంగా పార్టీ స్థితిగతులు బేరీజు వేసి.. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ తీసుకోవడం కీలకం. అప్పుడే తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బెంగాల్ గెలుపు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి.. తెలంగాణలోనూ బెంగాల్ తరహా రాజకీయం అంటే.. తాత్కాలికంగా బాగుంటుంది. కానీ కొన్నాళ్లు పోయాక.. అసలు ఇక్కడ బెంగాల్ తరహా రాజకీయం ఎలా చేస్తారని.. మళ్లీ బీజేపీ కార్యకర్తలకే అనుమానాలు వస్తే.. అది వారి తప్పు కాదు. ఏతావాతా రాష్ట్ర పార్టీ నేతలకు, శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసి.. గెలుపు తప్ప మరే వ్యూహం పార్టీకి లేదనే క్లారిటీ ఇవ్వడం అత్యవసరం. అలా కొన్నాళ్ల పాటు రాజకీయ వ్యూహాన్ని స్థిరంగా కొనసాగిస్తేనే.. తెలంగాణలో బీజేపీ గెలుపు గురించి ఆలోచించగలదనడంలో సందేహం లేదు.