Reading Time: 2 minutes

విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతున్న ‘డిజీ లాకర్’

Caption of Image.

నేటి  సమాచార సాంకేతిక యుగంలో ప్రభుత్వసేవలు వేగవంతం కావడంతోపాటు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి.  విద్య, ఉపాధి, పరిపాలన వంటి రంగాల్లో డిజిటల్ ఛేంజ్​ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డిజి లాకర్’ సేవ విద్యార్థులకు ఒక వరంగా మారింది. 

ముఖ్యంగా విద్యార్థుల విద్యార్హత పత్రాలు, మార్కుల జాబితాలు, బదిలీ ధ్రువపత్రాలు, గుర్తింపు పత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరచుకునే అవకాశం కల్పించడం వల్ల ఇది విద్యా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలిచింది. గతంలో విద్యార్థులు తమ  సర్టిఫికెట్లను భద్రపరచుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పత్రాలు పోవడం, చినిగిపోవడం, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి కారణాల వల్ల నష్టం జరగడం సాధారణ విషయాలే. ఒకసారి ఒరిజినల్ సర్టిఫికెట్ పోతే దాని డూప్లికేట్ పొందడం కోసం విద్యాసంస్థలు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా డిజి లాకర్ వ్యవస్థ ముందుకు వచ్చింది.

సురక్షిత డిజిటల్ నిల్వ వేదిక

డిజి లాకర్ అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్షిత డిజిటల్ నిల్వ వేదిక. ఇందులో విద్యార్థులు తమ విద్యా పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచుకోవచ్చు. ఒకసారి పత్రాలు డిజి లాకర్‌‌లో నమోదైతే, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ ద్వారా వాటిని పొందవచ్చు.  దీంతో భౌతిక పత్రాలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. 

ముఖ్యంగా ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుంది.  విద్యార్థులకు డిజి లాకర్ అందించే ప్రధాన ప్రయోజనం భద్రత. సాధారణంగా ఇంట్లో లేదా ఫైళ్లలో భద్రపరిచిన పత్రాలు కాలక్రమేణా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ డిజిటల్ నిల్వలో ఉన్న పత్రాలు సురక్షితంగా ఉంటాయి. 

 విద్యార్థుల వ్యక్తిగత సమాచారం రక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరో ముఖ్యమైన అంశం పారదర్శకత. గతంలో నకిలీ సర్టిఫికెట్ల సమస్య విద్యా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉద్యోగ నియామకాలు, ప్రవేశాల సమయంలో నకిలీ పత్రాల వినియోగం అనేక వివాదాలకు దారితీసింది. డిజి లాకర్ ద్వారా జారీ అయ్యే ధ్రువపత్రాలు సంబంధిత సంస్థల ద్వారా నేరుగా ధృవీకరిస్తాయి. అందువల్ల నకిలీ పత్రాలకు తావు తగ్గి, వ్యవస్థపై విశ్వసనీయత పెరుగుతుంది.

డిజి లాకర్‌‌‌‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

డిజి లాకర్ పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది.  డిజిటల్ ధ్రువపత్రాల వినియోగం పెరిగితే కాగితం అవసరం తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇది  డిజిటల్ ఇండియా లక్ష్యాలతో పాటు గ్రీన్ ఇండియా భావనకు కూడా బలాన్నిస్తుంది. అయితే డిజి లాకర్  విజయవంతంగా అమలుకావాలంటే కొన్ని సవాళ్లను కూడా అధిగమించాల్సి ఉంది. 

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అవగాహన ఇంకా పూర్తిస్థాయిలో పెరగలేదు. అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సేవ గురించి సరైన సమాచారం లేక ఉపయోగించలేకపోతున్నారు. ఇంటర్నెట్ సదుపాయాలు, స్మార్ట్‌‌ఫోన్‌‌ల లభ్యత కూడా కొన్ని ప్రాంతాల్లో పరిమితంగానే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి డిజి లాకర్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.  

ప్రస్తుతం అనేక విశ్వవిద్యాలయాలు, విద్యా బోర్డులు, ప్రభుత్వ సంస్థలు డిజి లాకర్‌‌తో అనుసంధానమవుతున్నాయి. భవిష్యత్తులో అన్ని విద్యాసంస్థలు ఈ వ్యవస్థను పూర్తిగా స్వీకరిస్తే విద్యార్థుల పరిపాలనా భారాలు గణనీయంగా తగ్గుతాయి.  

మొత్తంగా చూస్తే డిజి లాకర్ కేవలం ఒక డిజిటల్ నిల్వ వ్యవస్థ మాత్రమే కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు భద్రత కల్పించే ఆధునిక సాధనం.  విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ప్రభుత్వాలు మరియు విద్యాసంస్థలు మరింత విస్తృతంగా ప్రోత్సహించడం ద్వారా డిజిటల్ భారత నిర్మాణానికి బలమైన పునాది వేయవచ్చు. డిజి లాకర్‌‌లో భద్రపరచిన ప్రతి సర్టిఫికెట్ విద్యార్థి భవిష్యత్తుకు ఒక భద్రతా హామీగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

– తిప్పర్తి శ్రీనివాస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.

 

 

©️ VIL Media Pvt Ltd.