
భారతీయుల ఇళ్లలో వేల టన్నుల బంగారం అల్మారాల్లో, లాకర్లలో ఉపయోగం లేకుండా ఉంది. ఇప్పుడు నిద్రిస్తున్న బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే ఆస్తిగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే రెండు వారాల్లో ఈ స్కీమ్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం దేశంలో సుమారు 25 వేల టన్నుల బంగారం ప్రజల వద్ద ఉందని అంచనా. ఇందులో కేవలం 5 శాతం బంగారాన్ని స్కీమ్ కింద తీసుకురాగలిగితే 1,250 టన్నుల వరకు బంగారం వ్యవస్థలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని విలువ దాదాపు రూ.8లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
కొత్త స్కీమ్‌లో ఏం మారబోతోంది?
2015లో ప్రారంభించిన పాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో ప్రధానంగా బ్యాంకుల ద్వారానే బంగారం డిపాజిట్ చేసే అవకాశం ఉండేది. కానీ కొత్త విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న బంగారు నగల వ్యాపారులను కూడా “కలెక్షన్ పార్ట్‌నర్స్”గా చేర్చే ఆలోచన ప్రతిపాదనలో ఉంది. అంటే ప్రజలు తమకు దగ్గరలోని గుర్తింపు పొందిన జ్యువెలరీ షాపులోనే బంగారాన్ని డిపాజిట్ చేసే వీలు కలగవచ్చు. దీంతో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మరింత సులభంగా ప్రజలకు చేరే అవకాశం ఉంది.
బంగారం యజమానులకు లాభం ఏంటి?
ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం అలాగే ఉంచితే ఎలాంటి ఆదాయం రాదు. కానీ ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే బంగారంపై వడ్డీ లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు నిబంధనల ప్రకారం బంగారం లేదా దానికి సమానమైన డబ్బు పొందే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే ఉపయోగంలో లేని ఆస్తి ఆదాయం ఇచ్చే పెట్టుబడిగా మారనుందన్నమాట.
జ్యువెలరీ వ్యాపారులకు ఎలా ఉపయోగం?
కొత్త స్కీమ్ అమలైతే జ్యువెలరీ దుకాణాలకు కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి. ప్రజల నుంచి బంగారాన్ని సేకరించే బాధ్యత రావడంతో వారి వద్దకు కస్టమర్ల రాక పెరిగే అవకాశం ఉంది. దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే అందుబాటులో ఉన్న బంగారాన్ని ఉపయోగించుకునే అవకాశం పెరగడంతో ముడి బంగారం లభ్యత మెరుగుపడుతుంది. దీంతో దిగుమతి పన్నుల భారం తగ్గి తయారీ వ్యయం తగ్గే అవకాశం కూడా ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు..
భారత్ ప్రతి సంవత్సరం భారీగా బంగారం దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా ఖర్చవుతుంది. ఈ స్కీమ్ విజయవంతమైతే బంగారం దిగుమతులు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో డాలర్ల డిమాండ్ తగ్గి, దేశ విదేశీ మారక నిల్వలకు కూడా ఊరట లభించవచ్చు. అలాగే దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారం ఉత్పాదక మూలధనంగా మారి ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది.
ALSO READ : డబ్బులు లేవంటారు.. ఉన్న డబ్బులు తీసుకోరు
పాత స్కీమ్ ఎందుకు సక్సెస్ కాలేదు?
2015లో ప్రారంభించిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. దాదాపు పదేళ్లలో కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే స్కీమ్ కింద వచ్చింది. కుటుంబ వారసత్వ నగలను కరిగించేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడం, పన్నులపై భయాలు, బ్యాంకులు ఈ పథకాన్ని పెద్దగా ప్రోత్సహించకపోవడం వంటి కారణాలతో అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు జ్యువెలర్లను కూడా భాగస్వాములుగా చేర్చి.. ప్రక్రియను మరింత సులభతరం చేయడం ద్వారా ఈసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు కొత్త ఊపు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.