Reading Time: 2 minutes

డబ్బులు లేవంటారు.. ఉన్న డబ్బులు తీసుకోరు : PF ఖాతాల్లో మురిగిపోతున్న రూ.10 వేల కోట్లు

Caption of Image.

ఉద్యోగం మారిన తర్వాత లేదా ఉద్యోగాన్ని వదిలేశాక చాలామంది తమ పీఎఫ్ అకౌంట్ గురించి పూర్తిగా మర్చిపోతుంటారు. అయితే అలాంటి నిర్లక్ష్యం ఎంత పెద్ద మొత్తంలో ఉద్యోగుల సొమ్మును ఖాతాల్లోనే నిలిపేస్తుందో తాజా సమాచారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 31 లక్షల ఇన్‌యాక్టివ్ EPF ఖాతాల్లో రూ.9వేల 330 కోట్లకు పైగా ఉద్యోగుల పదవీ విరమణ సొమ్ము ఇప్పటికీ క్లెయిమ్ కాకుండా ఉందని తేలటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

2026 మార్చి 31 నాటికి దేశంలో 30లక్షల 91వేల 862 ఇన్‌ఆపరేటివ్ EPF ఖాతాలు ఉన్నాయని EPFO వెల్లడించింది. ఈ అకౌంట్లలో మొత్తం రూ.9వేల 330 కోట్లకు పైగా డబ్బు ఉంది. ఈ ఖాతాల్లో ఉద్యోగులు చాలాకాలంగా ఎలాంటి లావాదేవీలు చేయకపోవడంతో అవి ఇన్‌యాక్టివ్‌గా మారాయి. ఉద్యోగం మారడం, ఖాతాను ట్రాన్స్‌ఫర్ చేయకపోవడం,  క్లెయిమ్ చేయడం మరిచిపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ సమస్య ఇంకా పెద్దగానే ఉంది. 2025లో 31లక్షల 83వేల ఇన్‌యాక్టివ్ ఖాతాలు ఉండగా.. 2026లో అవి సుమారు 92 వేల మేర తగ్గి 30లక్షల 91వేలకు చేరాయి. అలాగే క్లెయిమ్ కాని మొత్తం రూ.10వేల 181 కోట్ల నుంచి రూ.9వేల 330 కోట్లకు తగ్గిందట. అయినప్పటికీ వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఉద్యోగుల క్లెయిమ్స్ కోసం ఎదురుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

రూ.9వేల 330 కోట్ల విలువ ఎంత పెద్దదో చెప్పాలంటే.. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ విమానయాన అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ఉడాన్ స్కీమ్ పై ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయానికి దాదాపు సమానం. అలాగే ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజనకు కేటాయించే వార్షిక బడ్జెట్‌కు కూడా దగ్గరగా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ మొత్తంతో దాదాపు 3 ఐఐటీలను నిర్మించొచ్చని తేలింది.

ALSO READ : వైరల్ సక్సెస్ స్టోరీ: ఒకప్పుడు జొమాటో డెలివరీ బాయ్..

ఉద్యోగం మారిన ప్రతిసారీ EPF ఖాతాను కొత్త సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేయడం, ఆధార్, బ్యాంక్ వివరాలు, నామినేషన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం, EPFO పోర్టల్‌లో అకౌంట్ స్టేటస్ పరిశీలించడం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు పీఎఫ్ ఖాతాదారులకు. లేకపోతే మీ కష్టార్జిత సొమ్ము కూడా లక్షలాది ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో ఒకటిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.