
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారికి త్వరలో కొత్త షాక్ తగలనుంది. ఇప్పటి వరకు విమానంలో బయలుదేరే ప్రయాణికులే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు(UDF) చెల్లిస్తుండగా, ఇకపై విమానం దిగే ప్రయాణికులపై కూడా ఛార్జీలు విధించే ప్రతిపాదన ఒకటి కొత్తగా తెరపైకి వచ్చింది. అయితే మొత్తం ఛార్జీ పెరగడం కాదు.. చెల్లింపు విధానంలో మార్పు తీసుకురావడమే ఈ ప్రతిపాదన ప్రత్యేకత అని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు బయలుదేరేటప్పుడు రూ.750, అంతర్జాతీయ ప్రయాణికులు రూ.1,500 యూజర్ ఫీజులు చెల్లిస్తున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం దేశీయ ప్రయాణికులు బయలుదేరేటప్పుడు రూ.580, తిరిగి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాక రూ.170 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు బయలుదేరేటప్పుడు రూ.1,150, చేరుకున్న తర్వాత రూ.350 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం చెల్లించాల్సిన పేమెంట్ యథాతథంగానే ఉన్నా.. బయలుదేరే సమయంలో పడే భారం తగ్గనుంది.
ప్రయాణికులపై ప్రభావం..
ఈ మార్పుతో ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో చెల్లించే ఛార్జీల నిర్మాణంలో మార్పు కనిపించనుంది. బయలుదేరే సమయంలో చెల్లించాల్సిన మొత్తం తగ్గడంతో కొంత ఊరట లభించినా, తిరిగి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా UDF చెల్లించాల్సి రావడం కొత్త అంశం. ఇతర ప్రధాన విమానాశ్రయాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండటంతో.. హైదరాబాద్‌లోనూ అదే పద్ధతిని తీసుకురావాలని విమానాశ్రయ యాజమాన్యం భావిస్తోంది.
2030 తర్వాత మరింత ఊరట..
ఈ ప్రతిపాదనకు అనుమతి లభిస్తే 2030 వరకు ఇదే ఛార్జీలు అమల్లో ఉంటాయి. అయితే 2030-31లో దేశీయ ప్రయాణికులకు మొత్తం UDFను రూ.520కు, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.1,140కు తగ్గించే ప్రణాళికను కూడా సంస్థ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రేట్లతో పోలిస్తే భారీ తగ్గుదల ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ విమానాశ్రయం రాబోయే మూడు నుంచి నాలుగేళ్లలో సుమారు రూ.13వేల 975 కోట్లతో కొత్త టెర్మినల్, కొత్త రన్‌వే నిర్మించేందుకు సిద్ధమవుతోంది. 2031 నాటికి సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే లక్ష్యంతో ఈ విస్తరణ చేపడుతోంది. కొత్తగా దేశీయ, అంతర్జాతీయ, కార్గో రూట్లను ప్రారంభించే విమానయాన సంస్థలకు ల్యాండింగ్ ఛార్జీల్లో భారీ రాయితీలు ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది.
ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ(AERA) ప్రజాభిప్రాయాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి ఫైనల్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులే కొనసాగుతాయి.