Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Debut Michael Vaughan Alastair Cook Urge Bcci To Play Teen Sensation Vs England

Vaibhav Sooryavanshi India Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు భారత అభిమానులనే కాదు.. ప్రపంచ క్రికెట్ అభిమానులను కూడా ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బుడ్డోడికి అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ కూడా వైభవ్‌కు వెంటనే అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరడం విశేషం. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఎవరన్నా చెప్పండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీసీసీఐ,అగార్కర్‌కు చెప్పాలి:

‘స్టిక్ టు క్రికెట్’ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మైకేల్ వాన్.. ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఆడించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘బీసీసీఐకి, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఎవరైనా చెప్పాలి. ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?. మా చిన్నోడిని మైదానంలో చూడాలని ఉంది’ అని వాన్ వ్యాఖ్యానించాడు. వాన్ వ్యాఖ్యలకు స్పందించిన కుక్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘నేను రేపు స్టేడియానికి అభిమానిగా వెళ్తున్నాను. ఆ 15 ఏళ్ల కుర్రాడు తప్పకుండా ఆడాలని కోరుకుంటున్నాను’ అంటూ వైభవ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్:

2026 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. తన అద్భుతమైన ఆటతీరుకు గాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టులో చోటు దక్కినా.. తుది జట్టులో మాత్రం అవకాశం రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అదే సిరీస్‌లో భారత్ 0-2తో ఓటమిపాలవడం కూడా చర్చనీయాంశమైంది.

ప్రపంచమంతా వైభవ్ కోసం ఎదురుచూస్తోంది:

భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ కూడా వైభవ్ ప్రతిభపై ప్రశంసలు కురిపించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అద్భుత సీజన్ తర్వాత గుర్తుండిపోయే సీజన్ ఏదైనా ఉంటే అది వైభవ్ సూర్యవంశీదే. ప్రపంచ స్థాయి బౌలర్లపై అతడు చూపించిన ఆధిపత్యం అసాధారణం’ అని పేర్కొన్నాడు. ‘వైభవ్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాడు. భారత అభిమానులే కాదు.. ప్రపంచమంతా అతడు ఐపీఎల్‌లో ఆడిన తరహాలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా మెరుస్తాడని ఎదురు చూస్తోంది. అతడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే టీ20లతో పాటు వన్డేలు, టెస్టుల్లో కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడనే నమ్మకం నాకు ఉంది’ అని సబా కరీమ్ ధీమా వ్యక్తం చేశాడు.

ఇంగ్లండ్ సిరీస్‌లోనైనా అవకాశం దక్కుతుందా?:

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అయినా వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం అవకాశం లభిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. రెండో టీ20లో జట్టు కూర్పుపై అందరి దృష్టి ఉంది. సంజు శాంసన్ విఫలమవడం బుడ్డోడికి కలిసిరానుంది. ఇప్పటికే భారత మాజీలు, విదేశీ దిగ్గజాలు, అభిమానులు వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.