Reading Time: 2 minutes
Neha Dhupia Slams Paparazzi Actress Demands Privacy Asks Photographers To Stop Back Photos

Neha Dhupia: సోషల్ మీడియా, పాపరాజీ సంస్కృతిలో సినీ తారల వ్యక్తిగత గోప్యతపై చర్చ తీవ్రంగా సాగుతోంది. ఒకప్పుడు సినిమా ఈవెంట్లు, ప్రెస్ మీట్‌లకే పరిమితమైన కెమెరాలు ఇప్పుడు సెలబ్రిటీల ప్రతి అడుగును వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నటీమణుల విషయంలో అనుమతి లేకుండా తీసే వీడియోలు, వెనుక నుంచి చిత్రీకరించే ఫోటోలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ ధోరణిని బహిరంగంగా తప్పుబట్టగా, ఇప్పుడు బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా అదే అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమానికి హాజరైన నేహా ధూపియా, కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వస్తుండగా ఫోటో గ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. ఆ సమయంలో కొందరు ఆమె హెయిర్‌స్టైల్ గురించి వ్యాఖ్యానించడంతో పాటు వెనుక నుంచి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో నేహా ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశారు. వెనుక నుంచి ఫోటోలు, వీడియోలు ఎందుకు తీస్తారు? వాటిని ఎందుకు ప్రచురిస్తారు? దయచేసి ఈ పద్ధతిని వెంటనే ఆపండి అంటూ ఆమె నేరుగా ఫోటో గ్రాఫర్లను ప్రశ్నించారు.

ఫోటో గ్రాఫర్లు వెనుక నుంచి ఫోటోలు తీయబోమని చెప్పినా, నేహా తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేశారు. తనకు అలా చేయడం అస్సలు ఇష్టం లేదని, చాలా మంది నటీమణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయం ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము బయటకు వచ్చిన ప్రతిసారీ బ్యాగులు మోస్తూ వెనుకే నడుస్తూ వీడియోలు తీయడం సరైన పద్ధతి కాదని, సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఇటీవలి కాలంలో ఫోటో గ్రాఫర్ల ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసిన నటీమణుల్లో నేహా ధూపియా ఒక్కరే కాదు. జాన్వీ కపూర్, నేహా శర్మ, మోనా సింగ్ వంటి పలువురు నటీమణులు కూడా గతంలో వెనుక నుంచి చిత్రీకరించే వీడియోలు, ఫోటోలను తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఇటీవల ఈ సంస్కృతి రాకముందు సెలబ్రిటీల జీవితం మరింత ప్రశాంతంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌ సెలెబ్రిటీల గోప్యతపై మరోసారి చర్చకు దారితీశాయి.

కెరీర్ పరంగా చూస్తే నేహా ధూపియా జోరు మీద ఉన్నారు. ప్రముఖ ఈజిప్షియన్ దర్శకుడు అలీ అల్ అరబీ తెరకెక్కిస్తున్న ’52 బ్లూ’ చిత్రంతో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, శశిధర్ యాదవ్ కీలక పాత్రలు పోషించారు. ఇదే నేహా ధూపియా నటించిన తొలి అంతర్జాతీయ చిత్రం కావడం విశేషం. ఇక సెలబ్రిటీలకు అభిమానుల ప్రేమ ఎంత ముఖ్యమో, వారి గౌరవం, గోప్యత కూడా అంతే ముఖ్యమనే చర్చ ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వార్తల కోసం పోటీ పెరిగినా, హద్దులను దాటకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ఫోటో గ్రాఫర్లపై ఉందని నేహా ధూపియా వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.