
ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఆధార్‌లో తమ ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. జూలై 1, 2026 నుండి అమల్లోకి వచ్చేలా.. ఆధార్‌కు ఈమెయిల్ లింక్ చేయడానికి లేదా మార్చడానికి వసూలు చేసే రూ.75 ఛార్జీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు UIDAI ప్రకటించింది.
ఈ ఉచిత సేవ నిరంతరాయంగా కాకుండా పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూలై 1 నుండి వచ్చే 6 నెలల పాటు.. అంటే డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే ఈ ఉచిత సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆధార్ మొబైల్ యాప్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రజలు తమ ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చని యూఐడీఏఐ స్పష్టం చేసింది. డిసెంబర్ 31 దాటితే మాత్రం మళ్లీ పాత రుసుము వర్తిస్తుంది.
ఆధార్ కార్డుకు ఈమెయిల్ ఐడీని లింక్ చేయడం వల్ల వినియోగదారులకు భద్రతతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆధార్‌కు సంబంధించిన OTP, అప్‌డేట్ అలర్ట్‌లు, ఆన్‌లైన్ లావాదేవీల సమాచారం నేరుగా ఈమెయిల్‌కు వస్తుంది. ఒకవేళ మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా లేకపోయినా.. ఈమెయిల్ ద్వారా ఓటీపీని పొంది సులభంగా పనులు పూర్తి చేసుకోవచ్చు. మోసాలను అరికట్టడానికి కూడా ఈ ఈమెయిల్ అప్‌డేట్ ఎంతో సహాయపడుతుంది.
ఇప్పటివరకు ఈమెయిల్ అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పైగా ఫీజు కూడా చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా నేరుగా మొబైల్ యాప్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేసే వెసులుబాటు కల్పించడంతో సామాన్యులకు పెద్ద ఊరట లభించింది. ఇంకా తమ ఆధార్‌కు ఈమెయిల్ లింక్ చేసుకోని వారు, అలాగే పాత ఈమెయిల్ మార్చాలనుకునే వారు ఈ డిసెంబర్ లోపు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.