
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- డీలిమిటేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులపై మోదీ ఫోకస్
- కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌కు వాయిదా వేసే యోచన
- వయసు పైబడిన మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి పార్లమెంట్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి బిల్లులను ఆమోదించుకోవడానికే మోదీ సర్కారు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేనందున, ఓటింగ్‌కు ముందు నేతల్లో ఎలాంటి అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విస్తరణను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలకు వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. ప్రధాని మోదీ జులై మొదటి వారంలో విదేశీ పర్యటనలతో బిజీగా ఉండటం కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
మంత్రివర్గంలో కీలక స్థానాలు ఖాళీ
ప్రస్తుత మంత్రివర్గంలో కొన్ని కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి(యూపీ), కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా(ఢిల్లీ) వేర్వేరు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. పార్టీలో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే నిబంధన ఉన్నప్పటికీ, రాబోయే ఎన్నికల దృష్ట్యా వీరిని ప్రస్తుతానికి కొనసాగించే అవకాశం ఉంది.
రిపోర్ట్ కార్డ్ ఆధారంగా మార్పులు
ఈసారి జరగబోయే పునర్వ్యవస్థీకరణలో పలు ఆసక్తికరమైన అంశాలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. మే నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రుల రిపోర్ట్ కార్డ్‌ను ప్రధాని మోదీ పరిశీలించారు. దీని ఆధారంగానే కేబినెట్ లో మార్పులు జరగనున్నాయి. పార్టీ యువతకు ప్రాధాన్యం ఇస్తుండటంతో, వయసు పైబడిన కొందరు మంత్రుల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం దక్కవచ్చు.