Reading Time: 2 minutes
Veteran Actor Ashok Saraf Recreates Wedding With Wife Nivedita After 37 Years

Celebrity Wedding: ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని కొందరు తమ జీవితంతోనే నిజం చేస్తారు. పెళ్లై దశాబ్దాలు గడిచినా అదే ప్రేమ, అదే అనుబంధం, అదే ఆప్యాయతను కొనసాగిస్తూ ఆదర్శ దంపతులుగా నిలుస్తుంటారు. ఇప్పుడు అలాంటి అరుదైన ఉదాహరణగా నిలిచారు హిందీ, మరాఠీ సినీ పరిశ్రమల సీనియర్ నటుడు అశోక్ సరఫ్, ఆయన సతీమణి నివేదిత సరఫ్. తమ 37వ వివాహ వార్షికోత్సవాన్ని సాధారణంగా జరుపుకోకుండా, మళ్లీ వధూవరుల్లా అలంకరించుకుని ఒకరికి ఒకరు పూలమాలలు మార్చుకోవడం ద్వారా మరోసారి వివాహ వేడుకను గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

మరాఠీ చిత్రసీమలో అత్యంత గౌరవనీయమైన నటులలో అశోక్ సరఫ్ ఒకరు. కామెడీ , ఎమోషన్స్, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన నటనతో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఆదర్శ దంపతులుగా పేరుపొందిన అశోక్, నివేదితలు 1990లో గోవాలోని ప్రసిద్ధ మంగేషి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మూడు దశాబ్దాలకు పైగా కలిసి జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య సుమారు 18 సంవత్సరాల వయస్సు తేడా ఉన్నప్పటికీ, అది తమ బంధానికి ఎప్పుడూ అడ్డంకిగా మారలేదని వారి జీవితమే చెబుతోంది.

37 ఏళ్ల దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఇద్దరూ మరోసారి పెళ్లి చేసుకున్నట్లుగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. స్కై బ్లూ రంగు చీరలో నివేదిత సరఫ్ ఆకట్టుకోగా, కుర్తా పైజామాలో అశోక్ సరఫ్ ఆనందంగా కనిపించారు. ఒకరికి ఒకరు పూలమాలలు మార్చుకుని, ఏడు జన్మల పాటు ఇలాగే కలిసి ఉండాలని కోరుకన్నారు. ఈ అరుదైన క్షణాలు చూసి అభిమానులు కూడా ఎమోషన్ అవుతున్నారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అశోక్ సరఫ్ పంచుకున్న సందేశం కూడా ఎంతో మందిని కదిలించింది. 37 సంవత్సరాలు గడిచినా నిన్ను చూసిన ప్రతిసారీ నా హృదయం ఇప్పటికీ అదే ఆనందంతో నవ్వుతుంది. నా ప్రాణ స్నేహితురాలిగా, నా బలంగా, నా శాశ్వత ప్రేమగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌కు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అశోక్, నివేదిత దంపతులకు అనికేత్ సరఫ్ అనే కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రుల మాదిరిగా సినీ రంగాన్ని ఎంచుకోకుండా, చెఫ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

అశోక్ సరఫ్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన మరాఠీ సినిమాలతో పాటు హిందీ ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు. ముఖ్యంగా 1990లో ప్రసారమైన ప్రముఖ హిందీ సిట్‌కామ్ ‘హమ్ పాంచ్’లో ఆనంద్ మాథుర్ పాత్రలో ఆయన నటన దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఐదుగురు కుమార్తెల తండ్రిగా ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే సమయంలో ఆయన భార్య నివేదితతో కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై మహారాష్ట్ర సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం కూడా విశేషంగా నిలిచింది. సినీ పరిశ్రమలో బంధాలు ఎక్కువ కాలం నిలవడం అరుదుగా మారుతున్న ఈ రోజుల్లో, 37 సంవత్సరాల దాంపత్యాన్ని ప్రేమతో, పరస్పర గౌరవంతో కొనసాగిస్తూ, అదే అనుబంధాన్ని మరోసారి పెళ్లి వేడుకలా సెలబ్రేట్ చేసుకున్న అశోక్ సరఫ్, నివేదిత సరఫ్ దంపతులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.