
Online House Hunting Scams: ఆన్‌లైన్ వేదికలు మన జీవితంలోని ప్రతి రంగాన్ని మార్చినట్లే, ఇల్లు కొనుగోలు చేసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు ప్రాపర్టీ డీలర్లను కలవడం, బ్రోచర్లు పరిశీలించడం ద్వారా ప్రారంభమయ్యే ఇంటి అన్వేషణ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతోంది. అనేక రకాల ప్రాపర్టీలను ఒకే చోట చూసే అవకాశం ఉండటంతో పాటు, ధరలు, ప్రాంతం, సౌకర్యాలు వంటి వివరాలను సులభంగా పోల్చుకునే వెసులుబాటు కూడా లభిస్తోంది. ఇటీవల చాలా మంది కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన ఇంటిని ఆన్‌లైన్‌లోనే వెతికేస్తున్నారు..
అయితే, ఈ సౌలభ్యంతో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందిస్తున్న నకిలీ ప్రాపర్టీ లిస్టింగ్‌లు, మోసపూరిత ప్రకటనలు, తప్పుడు సమాచారం కారణంగా అనేక మంది కొనుగోలుదారులు మోసపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం వల్ల జీవితకాల పొదుపును కోల్పోయే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అందుకే ఆన్‌లైన్‌లో ఇల్లు వెతుకుతున్నప్పుడు వేగం కంటే అప్రమత్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
అందమైన ఫొటోలు, తక్కువ ధరలు.. ఇవే మోసగాళ్ల ఎర
ప్రస్తుతం మోసగాళ్లు ఇంటర్నెట్‌లో ఉన్న నిజమైన ఇళ్ల ఫొటోలను సేకరించి, వాటిని AI టూల్స్‌తో మరింత ఆకర్షణీయంగా మార్చి నకిలీ లిస్టింగ్‌లు రూపొందిస్తున్నారు. అనంతరం మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలకు ఆ ప్రాపర్టీలను ఆన్‌లైన్‌లో ప్రకటనల రూపంలో ఉంచి కొనుగోలుదారులను ఆకర్షిస్తారు. తక్కువ ధరకే మంచి ఇల్లు దొరుకుతుందనే ఆశతో చాలామంది ఈ ఉచ్చులో పడిపోతున్నారు.
టోకెన్ అడ్వాన్స్ పేరుతో డబ్బు కాజేసే మోసం
ఈ తరహా మోసాల్లో నిందితులు తాము సైనికాధికారులమని, విదేశాల్లో ఉన్న ఎన్నారైలమని లేదా వేరే నగరంలో ఉన్న వ్యాపారులమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం తాము అందుబాటులో లేమని, ఇల్లు చూసేందుకు ఇప్పటికే చాలామంది ఆసక్తి చూపుతున్నారని చెబుతూ కొనుగోలుదారులపై ఒత్తిడి తీసుకొస్తారు. వెంటనే టోకెన్ అడ్వాన్స్ లేదా బుకింగ్ అమౌంట్ పంపాలని కోరుతారు. డబ్బు వారి ఖాతాలో జమ అయిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోతారు.
ఈమెయిల్ హ్యాకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా మార్పిడి
ఇటీవల పెరుగుతున్న మరో ప్రమాదకరమైన మోసం ఈమెయిల్ హ్యాకింగ్. హ్యాకర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్, బిల్డర్ లేదా న్యాయవాది ఈమెయిల్‌ను హ్యాక్ చేయడం లేదా అదే తరహాలో కనిపించే నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించడం చేస్తారు. ఒప్పందం చివరి దశకు చేరుకున్నప్పుడు కొత్త బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేయాలని సూచిస్తూ మెయిల్ పంపిస్తారు. కొనుగోలుదారుడు నిజమైన ఖాతానే అనుకుని డబ్బు పంపితే అది నేరుగా మోసగాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతుంది.
మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి?
ఆస్తిని ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాతే చెల్లింపు చేయండి
ఎంత ఆకర్షణీయమైన ఆఫర్ అయినా, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఆస్తిని స్వయంగా పరిశీలించకుండా ఎలాంటి అడ్వాన్స్ లేదా టోకెన్ అమౌంట్ చెల్లించకూడదు. వీలైతే కుటుంబ సభ్యుడు లేదా నమ్మకమైన న్యాయ సలహాదారుతో కలిసి ప్రాపర్టీని పరిశీలించి, యజమానిని కలిసిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు జరపాలి. వర్చువల్ టూర్‌లు కేవలం ప్రాథమిక పరిశీలనకే పరిమితం చేయాలి.
గూగుల్ మ్యాప్స్, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించండి
లిస్టింగ్‌లో ఉన్న ఫొటోలను మాత్రమే నమ్మకండి. గూగుల్ మ్యాప్స్, స్ట్రీట్ వ్యూ ద్వారా ఆ ప్రాంతం నిజంగా ఎలా ఉందో పరిశీలించండి. అలాగే గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఫొటోలను తనిఖీ చేయండి. అదే చిత్రాలు వేరే నగరంలోని లేదా వేరే వెబ్‌సైట్‌లోని ప్రాపర్టీలకు సంబంధించినవిగా కనిపిస్తే అది మోసానికి సంకేతంగా భావించాలి.
బ్యాంక్ ఖాతా వివరాలను ఫోన్ ద్వారా నిర్ధారించుకోండి
బ్యాంక్ ఖాతా వివరాలను మార్చినట్లు ఈమెయిల్ లేదా సందేశం వచ్చిన వెంటనే డబ్బు పంపించకండి. మీ వద్ద ఇప్పటికే ఉన్న అధికారిక ఫోన్ నంబర్‌కు నేరుగా కాల్ చేసి వివరాలను నిర్ధారించుకోవాలి. సందేశంలో ఇచ్చిన కొత్త నంబర్‌కు కాల్ చేయడం ప్రమాదకరం కావచ్చు.
RERA నమోదు తప్పనిసరిగా తనిఖీ చేయండి
భారతదేశంలో ఏ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసినా సంబంధిత రాష్ట్ర RERA వెబ్‌సైట్‌లో ఆ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించడం తప్పనిసరి. దీని ద్వారా ప్రాజెక్ట్ చట్టబద్ధత, డెవలపర్ విశ్వసనీయత గురించి స్పష్టమైన సమాచారం లభిస్తుంది. అలాగే ఆ ప్రాంతంలోని మార్కెట్ ధరలను తెలుసుకుని, అసాధారణంగా తక్కువ ధరకు లభిస్తున్న ప్రాపర్టీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
మొత్తంగా ఆన్‌లైన్‌లో ఇల్లు వెతకడం సమయాన్ని ఆదా చేసే సౌకర్యవంతమైన మార్గమే అయినప్పటికీ, ప్రతి ఆకర్షణీయమైన ప్రకటన నిజమనే గ్యారంటీ లేదు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలు, వెంటనే అడ్వాన్స్ చెల్లించాలనే ఒత్తిడి, ప్రత్యక్షంగా ఇల్లు చూపించడానికి నిరాకరించడం వంటి సంకేతాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. సరైన ధృవీకరణ, ప్రత్యక్ష పరిశీలన, RERA నమోదు తనిఖీ, బ్యాంక్ వివరాల నిర్ధారణ వంటి జాగ్రత్తలు పాటిస్తే ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఇల్లు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.