Reading Time: 2 minutes
Why India Are Delaying Vaibhav Sooryavanshis Debut Real Reason Behind Team Management Decision

Why Vaibhav Sooryavanshi Debut Delayed: 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఇంకా భారత జట్టు తరఫున అరంగేట్రం చేయకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలు కొట్టిన బుడ్డోడికి.. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అవకాశం రాకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అతడికి ఉద్దేశపూర్వకంగానే ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ‘హెయిరార్కీ’ (జట్టు క్రమశిక్షణ, సీనియారిటీ వ్యవస్థ) అని సమాచారం.

జట్టు హెయిరార్కీని దెబ్బతీయొద్దనే నిర్ణయం:

భారత క్రికెట్‌లో దేశవాళీ నుంచి జాతీయ జట్టుకు చేరే సంప్రదాయ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలోనే కేవలం 15 ఏళ్ల ఆటగాడిని నేరుగా సీనియర్ జట్టులోకి తీసుకురావడం జట్టు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 15 ఏళ్ల ఆటగాడిని నేరుగా జట్టులోకి తీసుకురావడం మిగతా ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ జట్టులో ఏర్పాటైన క్రమశిక్షణ, ఆటగాళ్ల మధ్య ఉన్న సమతౌల్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే వైభవ్ అరంగేట్రాన్ని ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వరల్డ్‌కప్ హీరోలపై పూర్తి నమ్మకం:

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు భారత్‌కు టీ20 ప్రపంచకప్ 2026 అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన వారిపై నమ్మకం కోల్పోవద్దని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. భవిష్యత్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆటగాళ్లకు పూర్తి భరోసా ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బృందం నిర్ణయించింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే ఇప్పటికే జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైభవ్ అరంగేట్రం ఆలస్యం అవుతోందని సమాచారం.

వైభవ్ కోసం ప్రపంచం ఎదురుచూపులు:

వైభవ్ సూర్యవంశీ ప్రభావం భారత క్రికెట్‌కే పరిమితం కాలేదు. ఐర్లాండ్‌లో కూడా బుడ్డోడి ఆట కోసం ఫాన్స్ ఎగబడ్డారు. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవడంతో స్టేడియం సామర్థ్యాన్ని పెంచేందుకు తాత్కాలిక సీట్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే వైభవ్ ఆడకపోవడం కాస్త నిరాశ కలిగించింది. తొలి బంతినే సిక్సర్ కొట్టే సామర్థ్యం ఉన్న ఆటగాడని.. ఇంగ్లండ్ బౌలర్లను అప్రమత్తం చేశారు. కానీ ఇప్పటివరకు వైభవ్ డ్రింక్స్ మోయడం, బెంచ్‌పైనే కూర్చోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.

గంభీర్ మేనేజ్‌మెంట్ స్పష్టమైన వ్యూహం:

భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ దస్కటే కూడా వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని అంగీకరించాడు. అయితే వరల్డ్‌కప్ గెలిపించిన సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను ఒక్కసారిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు భద్రత, నమ్మకం కల్పించడం కూడా మేనేజ్‌మెంట్ బాధ్యత అని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ గెలిచిన ఆటగాళ్లను మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం అని శ్రేయస్ తెలిపాడు.

రెండో టీ20పై అందరి దృష్టి:

మరోవైపు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మాత్రం వైభవ్‌కు వెంటనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇప్పుడు రెండో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన సూర్యవంశీకి ఈసారి అయినా అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా? లేక టీమిండియా మేనేజ్‌మెంట్ మరోసారి హెయిరార్కీకే ప్రాధాన్యం ఇస్తుందా? అన్నది ఇప్పుడు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.