Reading Time: < 1 minute
Cm Chandrababu Naidu Begins Three Day Kuppam Tour Launches Major Industrial Projects

CM Chandrababu Kuppam Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో విస్తృతంగా పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ సీఎం బిజీ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్‌కు చేరుకోనున్న ఆయన, అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

గుడుపల్లి మండలంలోని పొగురుపల్లిలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే రూ.3,847 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 23 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా రూ.1,026 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఆరు పరిశ్రమలకు సంబంధించి సీఎం సమక్షంలో ఎంఓయూలు కుదరనున్నాయి.

పొగురుపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అబీస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించడంతో పాటు 200 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అలాగే 28 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించనున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద నిర్మించిన 5,179 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం మీద సీఎం మూడు రోజుల కుప్పం పర్యటనలో అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయనున్నారు.