Reading Time: < 1 minute
పిల్లల కోసం వెళ్తే పిండాలే మాయం..! ఐవీఎఫ్ క్లినిక్‌కు వినియోగదారుల కమిషన్ షాక్

సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్న దంపతుల పిండాలను వారి అనుమతి లేకుండానే తొలగించిన ఫెర్టిలిటీ క్లినిక్‌పై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సేవల్లో లోపమే కాకుండా వైద్య నిర్లక్ష్యం, అన్యాయ వాణిజ్య పద్ధతిగా తేల్చింది. దంపతులకు రూ.5 లక్షల పరిహారంతో పాటు రూ.30 వేల కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. 2024లో దంపతులు ఐవీఎఫ్ చికిత్స పొందగా 14 అండాల నుంచి నాలుగు పిండాలు సిద్ధమయ్యాయి. వాటిలో రెండు మూడో రోజు (డే-3), మరో రెండు ఐదో రోజు (డే-5) పిండాలు ఉన్నాయి. ఏడాది పాటు భద్రపరిచేందుకు రూ.25 వేలు అదనంగా క్లినిక్‌కు చెల్లించారు. గడువు 2025 మార్చి 4 వరకు ఉంది.

ముందుగా డే-5 పిండాలను ఉపయోగించినా గర్భం దాల్చలేదు. దీంతో మిగిలిన డే-3 పిండాలను ఉపయోగించాలని దంపతులు కోరగా.. వాటిని ఇప్పటికే తొలగించినట్లు క్లినిక్ తెలిపింది. గడువు ముగియకముందే తమ అనుమతి లేకుండా పిండాలను తొలగించడం వల్ల తాము శాశ్వతంగా జీవసంబంధమైన సంతానం పొందే అవకాశాన్ని కోల్పోయామని దంపతులు కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణలో క్లినిక్ నిర్ణీత గడువులో తమ వాదనలు సమర్పించలేదు. దీంతో దంపతులు చేసిన ఆరోపణలను కమిషన్ పరిశీలించింది. పిండాలను ఏడాది పాటు భద్రపరుస్తామని డబ్బు తీసుకున్న క్లినిక్.. రెండు నెలల్లోనే వాటిని సమాచారం ఇవ్వకుండా తొలగించడం అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) చట్టం–2021 నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

“పిండాలను తొలగించడం వల్ల దంపతులు తమ సొంత సంతానాన్ని పొందే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయారు. ఇది తీవ్రమైన వైద్య నిర్లక్ష్యానికి నిదర్శనం” అని కమిషన్ వ్యాఖ్యానించింది. మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ రూ.5 లక్షల పరిహారం, రూ.30 వేల కేసు ఖర్చులు చెల్లించాలని క్లినిక్‌ను ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి