
పశ్చిమాసియా యుద్ధం దగ్గర నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఒక్కొక్క రోజు ఒకలాగా మార్కెట్ ట్రేడ్ అయింది. ఒకసారి భారీగా నష్టం జరిగితే.. ఇంకోసారి లాభాల్లోకి వెళ్లింది. ఇలా ఇన్వెస్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యుద్ధం గొడవ ఒకెత్తు అయితే.. ఇప్పుడు ఎల్‌నినో రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. జూన్ మాసం ముగిసింది గానీ ఆశించిన స్థాయిలో మాత్రం వర్షాలు లేవు. దీంతో ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం కూడా భీకరంగా ఉంటుందని హెచ్చరించింది.
ఇలాంటి తరుణంలో జూలై నెలలో స్టాక్ మార్కెట్‌కు సానుకూల ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జూలై నెలలో పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 25 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే జూలై నెల నిఫ్టీ-50కు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన నెలల్లో ఒకటిగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు.
సామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ జహోల్ ప్రజాపతి ప్రకారం.. 2001 నుంచి 2025 వరకు గత 25 ఏళ్లలో నిఫ్టీ-50 జూలై నెలలో 18 సార్లు లాభాలతో ముగిసింది. అంటే సుమారు 72 శాతం విజయావకాశాలు నమోదయ్యాయి. సగటున 2.19 శాతం రాబడితో జూలై నెల.. డిసెంబర్, నవంబర్ తర్వాత మూడో అత్యుత్తమ నెలగా నిలిచిందని తెలిపారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. జూలైలో సాధారణంగా రుతుపవనాల పురోగతి, తొలి త్రైమాసిక (Q1) కంపెనీ ఫలితాలపై సానుకూల అంచనాలు, దేశీయ పెట్టుబడిదారుల నుంచి కొనసాగుతున్న పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు మార్కెట్‌కు మద్దతునిస్తాయి. అయితే కేవలం గత చరిత్ర ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా సూచించారు.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కూడా భారత మార్కెట్‌కు కొంత అనుకూలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశాల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 72 డాలర్ల వద్దకు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో రూపాయి మారకం విలువ స్థిరపడుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FPI) అమ్మకాలు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్‌కు ఊరటనిస్తున్నాయని ప్రజాపతి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంక్షోభాలు తలెత్తకపోతే భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ఇది సానుకూల వాతావరణంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు.
నిఫ్టీ సాంకేతిక పరిస్థితి
జూలై 1న నిఫ్టీ-50 0.59 శాతం పెరిగి 24,005.85 దగ్గర ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ 0.58 శాతం లాభపడి 76,922.64 దగ్గర స్థిరపడింది. సామ్‌కో సెక్యూరిటీస్ డెరివేటివ్స్ రీసెర్చ్ అనలిస్ట్ ధుపేష్ ధమేజా మాట్లాడుతూ.. నిఫ్టీ 23,850-23,900 మద్దతు స్థాయిని విజయవంతంగా కాపాడుకోవడం సానుకూల సంకేతమన్నారు. అయితే 24,000 స్థాయిని తిరిగి దాటినప్పటికీ 100 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (100-DEMA) వద్ద ప్రతిఘటన ఎదురవుతోందని తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎస్‌ఐ (RSI) 55.13 వద్ద ఉండటం కూడా మార్కెట్ బలాన్ని సూచిస్తోందని.. అది 50 పైన కొనసాగినంత కాలం సానుకూల ధోరణి కొనసాగే అవకాశముందని చెప్పారు. మరోవైపు ఇండియా విక్స్ (India VIX) 2.63 శాతం తగ్గి 13.24 వద్దకు రావడం మార్కెట్‌లో అస్థిరత తగ్గిన సంకేతంగా విశ్లేషించారు.
24,200 దిశగా నిఫ్టీ?
ఎల్‌కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అభిప్రాయం ప్రకారం.. నిఫ్టీ ప్రస్తుతం 24,000 స్థాయి చుట్టూ కదులుతున్నప్పటికీ స్వల్పకాలిక ధోరణి ఇంకా సానుకూలంగానే ఉంది. 23,800 స్థాయి పైన కొనసాగినంత వరకు మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో నిఫ్టీ 24,200 స్థాయిని చేరుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.