
టెక్నాలజీ దూసుకుపోతోంది.. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. దేశంలో మొట్టమొదటి మాస్-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయెల్ కార్ ‘మారుతి వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్’ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ లాంచ్ అయిన కొన్ని వారాల్లోనే కేవలం మూడంటే మూడు రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదు కావడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. టెక్నాలజీ పరంగా మన కంపెనీలు అదరగొడుతున్నా, ఆ కార్లకు అసలైన ఇంధనం అందించే ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ లేకపోవడమే డిమాండ్ లేకపోవటానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి
ఆకర్షించే ఆఫర్.. అడ్డొస్తున్న ఇన్‌ఫ్రా
వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్ కారుని జూన్ 4న లాంచ్ చేసి.. జూన్ 17 నుండి డెలివరీలు ప్రారంభించారు. ఈ కొత్తరకం కార్లు E20 నుండి ఏకంగా E100 వరకూ వివిధ ఇథనాల్ బ్లెండ్స్ ఉండే పెట్రోల్ లో దేనితోనైనా నడిచే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం E85 ఫ్యూయెల్‌కు అనుమతి పొందింది. సాధారణ పెట్రోల్ వేరియంట్ కంటే దాదాపు రూ.74వేల నుండి రూ.86వేల వరకు అదనపు ధరతో రూ.7లక్షల 24వేలకు దీనిని కంపెనీ తెచ్చింది. అయితే జూన్ 29 నాటికి వాహన్ పోర్టల్‌లో కేవలం 3 యూనిట్లు మాత్రమే రిజిస్టర్ కావడం వెనుక ఒక పెద్ద తిరకాసు ఉంది. ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద E85 ఇంధనాన్ని విక్రయించే బంకులు కేవలం 48 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై పరిసర ప్రాంతాలకే పరిమితం కావడంతో, మిగిలిన ప్రాంతాల ప్రజలు ఈ కారు కొని ఏం చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది.
మైలేజ్ తిప్పలు.. లెక్కల్లో తేడా
పైకి చూస్తే E85 ఇంధనం ధర ముంబైలో లీటరుకు రూ. 91 పలుకుతోంది. అంటే సాధారణ పెట్రోల్ కంటే లీటరుకు సుమారు రూ.20 చౌక. వినడానికి ఇది భలే లాభసాటిగా అనిపించినా అసలు కథ వేరే ఉంది. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో ఎనర్జీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఇథనాల్ వాడే కొద్దీ కారు మైలేజ్ గణనీయంగా పడిపోతుంది. మారుతి సుజుకి ఈ కారుకు సంబంధించి అధికారిక మైలేజ్ వివరాలను ఇంకా బయటపెట్టకపోవడం, మరోవైపు తక్కువ మైలేజ్ వల్ల పెట్రోల్ బిల్లు భారం తగ్గకపోగా పెరిగే అవకాశం ఉండటంతో కస్టమర్లు ఈ కారు వైపు చూడటానికి జంకుతున్నారు.
బైకుల పరిస్థితీ ఇంతే..
ఈ దెబ్బ కేవలం మారుతి వ్యాగన్ఆర్‌కే తగలలేదు. ఇథనాల్ బైకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2024 అక్టోబర్‌లో వచ్చిన హోండా CB300F ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైక్ 2026 ప్రథమార్ధంలో 30 యూనిట్లు కూడా దాటలేదు. ఇక 2025లో వచ్చిన సుజుకి జిక్సర్ SF 250 FFV ఖాతా కూడా తెరవలేదు. గతంలో టీవీఎస్ అపాచీ E100 కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకే కనుమరుగైంది. ప్రస్తుతం ఫ్లెక్స్-ఫ్యూయెల్ మార్కెట్ ఒక చిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. బంకులు పెట్టాలంటే రోడ్ల మీద కార్లు ఉండాలి. కార్లు కొనాలంటే బంకులు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ లీటర్ల కొద్దీ ఇథనాల్‌ను సరఫరా చేసే మౌలిక వసతులను వేగంగా పెంచితేనే భవిష్యత్తులో ఈ గ్రీన్ టెక్నాలజీకి నిజమైన డిమాండ్ ని చూస్తుందని నిపుణులు అంటున్నారు.