
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (జులై 2) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ-క్యాబినెట్) సమావేశంగా దీనిని నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై క్యాబినెట్ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ట్యాబ్‌లు అందజేశారు. ఇటీవల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది.
ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన తాజా పరిణామాలు, తదుపరి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, ప్రాజెక్టు పురోగతిపై మంత్రివర్గం కీలకంగా సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ-రామ్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలా లేదా అనే అంశంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకంలోని కొన్ని నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.
వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల వైవిధ్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానికత ఉన్న ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రతిపాదిత ఎస్ఐజీ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలు, డిజైన్లు, విధివిధానాలకు కూడా ఆమోదం తెలిపే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. డిజిటల్ పాలన దిశగా ప్రభుత్వం వేస్తున్న మరో అడుగుగా భావిస్తున్న ఈ తొలి ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక విధాన నిర్ణయాలు వెలువడే అవకాశంపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి