
భారత్ ప్రపంచ ఆర్థిక సంబంధాల విస్తరణలో మరో కీలక ముందడుగు వేసింది. భారత్ – యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (Comprehensive Economic and Trade Agreement – CETA) 2026 కుదిరింది. ఇది జూలై 15 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి. దీనితో పాటు సామాజిక భద్రత ఒప్పందం (Agreement on Social Security) లేదా డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) కూడా అదే తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకేలో తాత్కాలికంగా పనిచేసే భారతీయ నిపుణులు, ఉద్యోగులు ద్వంద్వ సామాజిక భద్రత చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నారు. అంతేకాకుండా ఈ మినహాయింపు కాలాన్ని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచడం భారత్‌కు పెద్ద విజయంగా భావిస్తున్నారు. భారత్, యూకే ప్రభుత్వాలు తమ అంతర్గత ఆమోద ప్రక్రియలను పూర్తిచేయడంతో, ఈ రెండు ఒప్పందాలు అధికారికంగా 2026 జూలై 15 నుంచి అమల్లోకి రానున్నాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా, ఈ ఒప్పందం భారత్‌కు ఒక ప్రధాన గ్లోబల్ ఆర్థిక భాగస్వామ్యాన్ని కార్యరూపంలోకి తీసుకురానుంది.
ఈ చారిత్రాత్మక ఒప్పందానికి పునాది 2021 మేలో ఎన్‌హాన్స్‌డ్ ట్రేడ్ పార్ట్‌నర్‌షిప్ ఇండియా–యూకే రోడ్‌మ్యాప్ 2030 ద్వారా పడింది. ఈ ప్రణాళిక ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. 14 విడతల చర్చల అనంతరం 2025 మే 6న CETA ఒప్పందం పూర్తయింది. అనంతరం 2025 జూలై 24న లండన్‌లో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్, యూకే వ్యాపార వాణిజ్య కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో జరిగింది. తర్వాత 2026 ఫిబ్రవరి 10న డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC)పై కూడా సంతకాలు జరిగాయి.
భారత ఎగుమతులకు సుంక రహిత ప్రవేశం
CETA అమల్లోకి వచ్చిన తర్వాత భారత ఎగుమతిదారులు యూకే మార్కెట్లో అనేక రంగాల్లో పూర్తి సుంక రహిత ప్రవేశాలను పొందుతారు. దేనిపై ఎంత శాతం పన్ను తగ్గుతుందంటే..
- ప్రాసెస్డ్ ఫుడ్‌పై ప్రస్తుతం ఉన్న 70% వరకు సుంకం రద్దు
- సముద్ర ఉత్పత్తులపై 21.5% వరకు సుంకం రద్దు
- ఇంజనీరింగ్ వస్తువులు, ఆటో కాంపోనెంట్లపై 18% వరకు సుంకం రద్దు
- లెదర్, ఫుట్‌వేర్ ఉత్పత్తులపై 16% వరకు సుంకం రద్దు
- వస్త్రాలు, దుస్తులపై 12% వరకు సుంకం రద్దు
- రసాయనాలు, ఔషధాలపై 8% వరకు సుంకం రద్దు
దీంతో భారత రైతులు, మత్స్యకారులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, తయారీ రంగానికి పెద్దఎత్తున అవకాశాలు లభించనున్నాయి. తద్వారా భారత్ వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. పాల ఉత్పత్తులు, ధాన్యాలు, చిరుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజలు, యాపిల్స్, కూరగాయ ఉత్పత్తులు వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి. మరోవైపు సేవల రంగానికి కూడా భారీ ఊతం లభించనుంది. యూకే ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత విస్తృత సేవల మార్కెట్ ప్రవేశ అవకాశాల్లో ఇది ఒకటి. భారత ప్రయోజనాలకు సంబంధించిన 137 ఉపరంగాలకు మార్కెట్ యాక్సెస్ కల్పించింది. ఐటీ అండ్ ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆరోగ్య సేవలు, విద్యా రంగం, ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్స్, కన్సల్టెన్సీ సేవలతోపాటు భారతీయ నిపుణులకు సులభ వలస అవకాశాలు లభిస్తాయి. బిజినెస్ విజిటర్స్, ఇంట్రా-కార్పొరేట్ ట్రాన్స్‌ఫరీలు, కాంట్రాక్టు సేవల సరఫరాదారులు, స్వతంత్ర నిపుణులు, పెట్టుబడిదారులకు ఈ ఒప్పందం కింద మొబిలిటీ అవకాశాలు దక్కాయి. అలాగే ప్రతి సంవత్సరం 1800 భారతీయ చెఫ్‌లు, యోగా శిక్షకులు, శాస్త్రీయ సంగీత కళాకారులు యూకేలో ప్రత్యేక అవకాశాలు పొందనున్నారు.
DCC ఒప్పందం ప్రధాన ప్రయోజనం ఇదే..
DCC అమలుతో యూకేలో తాత్కాలికంగా పనిచేసే భారతీయ ఉద్యోగులు, కంపెనీలు రెండుసార్లు సామాజిక భద్రత చెల్లించాల్సిన అవసరం ఉండదు. 75,000 కంటే ఎక్కువ భారతీయ నిపుణులు, 900 కంటే ఎక్కువ భారతీయ కంపెనీలు దీని ద్వారా ప్రయోజనం పొందుతాయి. 2026 జూలై 1 నుంచి యూకే అమలు చేయనున్న కొత్త ఉక్కు విధానాల నేపథ్యంలో భారత్ – యూకే పరస్పర చర్చల ద్వారా భారత స్టీల్ ఎగుమతుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. భారత్ స్టీల్ ఎగుమతుల్లో 85% ఎగుమతులు కొత్త పరిమితుల పరిధికి వెలుపల ఉన్నాయి. మిగతా వాటికి కోటాలు, ఇతర ప్రత్యేక ప్రవేశ మార్గాలు కల్పించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న ఈ కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా రైతులకు ప్రీమియం ఎగుమతి మార్కెట్లు, మత్స్యకారులకు సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు, కార్మికులకు ఉపాధి అవకాశాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్, యువత, స్టార్టప్‌లు,, ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలు, నిపుణులకు అంతర్జాతీయ గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
వికసిత్ భారత్ 2047 దిశగా కీలక అడుగు
భారత్–యూకే CETA, DCC ఒప్పందాలు 2026 జూలై 15 నుంచి అమల్లోకి రావడం ద్వారా భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత బలంగా స్థిరపడేందుకు అవకాశం లభిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు కూడా కీలక మైలురాయిగా నిలవనుంది.