
- ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
- గుర్రంగూడలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
- రూ.35.50 కోట్లతో రాష్ట్రవ్యాప్త అభివృద్ధి పనులకు శ్రీకారం
- 30 ఏండ్ల న్యాయపోరాటం తర్వాత ఎకో పార్క్
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న రోబోటిక్ ఏనుగు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపడుతున్న వనమహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.35.50 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. గుర్రంగూడలో సీఎం రేవంత్ రెడ్డి ‘నాగలింగం’ మొక్కను నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
అటవీశాఖ మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా అటవీశాఖ 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసింది. పంచాయతీరాజ్, హెచ్‌ఎండీఏ సమన్వయంతో ఊరూరా పచ్చదనం నింపేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్) వినయ్ కుమార్, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, ఇతర ఉన్నతాధికారులు బుధవారం గుర్రంగూడ పార్కును సందర్శించారు. వీఐపీ ప్లాంటింగ్ ఏరియా, భద్రత, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీటి సదుపాయా లపై చర్చించారు.
న్యాయ వివాదాలు వీడి.. నందనవనంగా మారి..
గుర్రంగూడలోని 424.31 ఎకరాల అటవీ భూమి మూడు దశాబ్దాలుగా కోర్టు వివాదాల్లో ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఈ భూమి అటవీశాఖ పరం కావడంతో ప్రభుత్వం దీనిని ‘గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్క్’గా తీర్చిదిద్దింది. ఇక్కడ రూ.11.57 కోట్ల వ్యయంతోపాటు అదనంగా మరో రూ.6.27 కోట్లతో చేపట్టిన పనులను సీఎం ప్రారంభిస్తారు. ఇందులో 3.6 కి.మీ ప్రహరీ, యోగా షెడ్, వాచ్ టవర్, ఎకో ట్రయిల్ మార్గాలు వంటివి ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ (డిస్ట్రిక్ట్ 3150) సహకారంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.
ప్రత్యేక ఆకర్షణగా రోబోటిక్ ఏనుగు
సాంకేతికతను, పర్యావరణాన్ని మేళవిస్తూ అటవీశాఖ ఏర్పాటు చేసిన ‘రోబోటిక్ ఏనుగు’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. అలాగే ‘హైదరాబాద్ ది గ్రీన్ మెట్రోపొలిస్’ అనే పుస్తకాన్ని, ఎకో-టూరిజం విజన్ డాక్యుమెంట్ 2026=-30ను విడుదల చేయనున్నారు.
వర్చువల్‌గా 11 జిల్లాల్లో ప్రాజెక్టులు ప్రారంభం
గుర్రంగూడ పనులతోపాటు రాష్ట్రంలోని మరో 11 జిల్లాల్లో రూ.17.66 కోట్ల విలువైన ఎకో-టూరిజం ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివద్ధి పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు.