Reading Time: 2 minutes
Kannappa Re Release Date Vishnu Manchus Epic Devotional Film Returns To Theatres On June 27

Kannappa Re Release Date : భక్తి, త్యాగం, ఆధ్యాత్మికతను అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం ‘కన్నప్ప’. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భక్తిరస గాథను మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం ‘కన్నప్ప’ను మరోసారి థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ ఎపిక్ డివోషనల్ డ్రామాను మరోసారి భారీ తెరపై చూస్తూ భక్తి లో లీనం కానున్నారు.

విష్ణు మంచు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కిన ‘కన్నప్ప’లో ఆయన భక్త కన్నప్ప పాత్రలో ఒదిగిపోయి నటించారు. శివభక్తుడైన కన్నప్ప జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించారు. భక్తి కథలకు ఆధునిక విజువల్ ట్రీట్‌మెంట్‌ను జోడిస్తూ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పరమశివుడిపై అచంచల భక్తిని చాటిచెప్పిన కన్నప్ప కథను మరోసారి భారీ తెరపై ఆస్వాదించేందుకు సిద్ధం కావాలని మేకర్స్ అభిమానులను కోరారు. గతంలో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఇది మరో మంచి అవకాశం కానుంది.

‘కన్నప్ప’ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటీనటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. టెక్నికల్ గా కూడా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. స్టీఫెన్ దేవస్సి అందించిన సంగీతం భక్తి భావాన్ని మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేయగా, విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా నిలబెట్టాయి. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువల పరంగా కూడా ప్రశంసలు అందుకుంది.

ఇటీవలి కాలంలో పలు క్లాసిక్ చిత్రాలు, హిట్ సినిమాలు రీ రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో ‘కన్నప్ప’ కూడా మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భక్తి చిత్రాలను కుటుంబ సమేతంగా వీక్షించే ప్రేక్షకులకు ఈ సినిమా మరోసారి మంచి ఆధ్యాత్మిక అనుభూతిని అందించే అవకాశముంది. జూన్ 27న మరోసారి వెండితెరపై సందడి చేయనున్న ‘కన్నప్ప’ రీ రిలీజ్‌కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.