
బ్రిటన్: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత అమ్మాయిల జోరుగా కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది టీమిండియా ఉమెన్స్ జట్టు. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా బుధవారం (జూన్ 17) హెడ్లింగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.
భారత ఓపెనర్స్ స్మృతి మందనా (74), షఫాలీ వర్మ (55) హాఫ్ సెంచరీలతో రాణించగా.. బౌలింగ్‌లో శ్రీచరణి 4 వికెట్లతో చెలరేగడంతో నెదర్లాండ్స్‌ను 95 పరుగుల తేడాతో చిత్తు చేసింది హర్మన్ సేన. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. 210 పరుగుల లక్ష్య ఛేధనలో నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్మృతి మందనా మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది.
మందనా, షఫాలీ మెరుపులు
ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్స్ స్మృతి మందనా (74), షఫాలీ వర్మ (55) మెరుపు ఆరంభానిచ్చారు. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (12), జెమీమా రోడ్రిగ్స్ (19) అంచనాల మేర రాణించలేదు. చివర్లో రిచా ఘోష్ (20), దీప్తి శర్మ (10) మెరుపులు మెరిపించి ఇండియాకు భారీ స్కోర్ అందించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంగే రెండు వికెట్లు తీయగా.. మిర్తే వాన్ డెన్ రాడ్, హెదర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్ తలో వికెట్ తీశారు.
నెదర్లాండ్స్‌ను చుట్టేసిన శ్రీచరణి, షఫాలీ
210 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగిన నెదర్లాండ్స్ 114 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా స్పిన్నర్లు శ్రీచరణి (4) , షఫాలీ వర్మ (3) నెదర్లాండ్స్‌ను చావు దెబ్బ కొట్టారు. భారత బౌలర్ల ధాటికి హెదర్ సీగర్స్ (21), ఫీబీ మోల్కెన్‌బోర్ (15), బాబెట్ డి లీడ్ (28), స్టెర్రే కాలిస్ (18) నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగితా ఏడుగురు బ్యాటర్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో నందిని శర్మ రెండు, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
►ALSO READ | నెదర్లాండ్స్ మ్యాచ్‌లో శ్రేయాంకకు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై మైదానం వీడిన టీమిండియా స్టార్