Reading Time: < 1 minute

ఒక ఇంటి కాపలా కాస్తూ పొరుగింటికి కన్నం.. రూ.25 లక్షల బంగారం, వెండి మాయం.. ఛేదించిన అల్వాల్ పోలీసులు

Caption of Image.

ఒక ఇంటి కపాలాదారు పొరుగింటికి కన్నం వేసిన ఘటనను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఊరు వెళ్లి వచ్చే లోపే ఇల్లు గుల్ల చేసి 25 లక్షల విలువైన బంగారం, వెండి మాయం చేసిన ఘటనలో.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అల్వాల్ మచ్చబోల్లారం చంద్రపురి కాలనీకి చెందిన మేడిశెట్టి శ్యామ్  తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేలోపు ఇల్లు గుళ్ళయినట్లు పోలీసులు తెలిపారు. శ్యామ్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి జూన్ 3న స్వగ్రామానికి వెళ్లారు. దాదాపు మూడు వారాల అనంతరం జూన్ 27న ఇంటికి చేరుకున్నాడు. ప్రధాన ద్వారం తాళం, బెడ్‌రూమ్ బీరువా పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు.

ఇంట్లోనే ఉన్న తాళాలతో గోద్రేజ్ లాకర్ తెరిచి, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును అపహరించినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సీసీ కెమెరాలలో ఇంట్లో పని చేసే వాచ్మెన్ చోరీకి పాల్పడ్డట్లు గుర్తించారు. 

►ALSO READ | బాచుపల్లిలో దారుణం.. తాగొద్దు అన్నందుకు భార్యను చంపేసిన భర్త.. సూసైడ్ డ్రామా !

అల్వాల్ ప్రాంతానికి చెందిన వాచ్మెన్ కొల్లి లోవరాజు, పాపాని రాజు, మైలారం మహేష్ చారి ల సహకారంతో పక్కా ప్రణాళిక ప్రకారం చోరీకి పాల్పడ్డట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడు కొల్లి లోవరాజు బాధితుడి ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. బాధిత కుటుంబం స్వగ్రామానికి వెళ్లిన విషయం, ఇంట్లో ఎవరూ లేరన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు.  

బీరువా పగులగొట్టి ఇంట్లోనే ఉన్న తాళాలతో లాకర్ తెరిచి విలువైన ఆభరణాలు, నగదును అపహరించాడు. అనంతరం దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను పాపాని రాజు, స్వర్ణకారుడు మహేష్ చారికి విక్రయించినట్లు విచారణలో తేలింది. నిందితుల నుండి 20 లక్షల విలువైన 13 తులాల బంగారంతో పాటు 330 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట ఏసీపి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.