
మీ బంగారం మేం కొంటాం.. ధర లెక్కగట్టి అక్కడికక్కడే అర నిమిషంలోనే డబ్బులిస్తాం..! అని బండక్షరాలతో పెద్దపెద్ద బోర్డులు కట్టి చేసే ఓల్డ్ గోల్డ్ మార్కెట్ గురించి తెలుసుగా? ఈ ఏడాది అది అమాంతం పెరిగి రెండుమూడింతలకు చేరింది. ముత్తూట్, ఆతిక, మణిపాల్‌లాంటి బ్రాండెడ్ కంపెనీలైతే గోల్డుకు లోన్లివ్వడం కంటే, పాత బంగారం కొనుగోళ్లమీదే పెద్దగా ఫోకస్ పెట్టేశాయి. దీనికి కారణం, జనం పాత బంగారాన్ని తెగనమ్ముకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడమే. అవును, మనింటి బంగారం గడప దాటిపోతోంది. పసిడి ధరల పతనావస్థకు జడుసుకుని, ఆలసిస్తే ఇంకా దెబ్బైపోతామని బెంబేలెత్తి, బీరువాల్లో బంగారాన్ని బైటికి తీస్తున్నారు. షాపుల వెంట పరుగుపెడుతున్నారు. గత మూడునెలల్లోనే దేశంలో 50 టన్నుల ఓల్డ్ గోల్డ్ అమ్మకాలు జరిగాయ్. డెఫినిట్‌లీ, పసిడి మార్కెట్ ప్రస్థానంలో ఇదొక రిమార్కబుల్ స్టేజ్.
దీని పర్యవసానాలు ఏంటి?
ఇదే క్యాలెండర్‌లో మార్చి 2వ తేదీ సరిగ్గా నాలుగు నెలల కిందట 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర అక్షరాలా లక్షా 69 వేల 349 రూపాయలు. లక్షా డెభ్బై వేలకు జస్ట్ అరంగుళమే దూరం. అప్పటివరకూ అదే ఆల్‌టైమ్ హై. అన్ని రికార్డుల్నీ బద్దలుకొట్టి, కిలో 3 లక్షల దిశగా పరుగెత్తుతున్న వెండితో పోటీ పడింది పసిడి. దీనికి కారణాలూ లేకపోలేదు. సరిగ్గా ఇరాన్-ఇజ్రాయెల్ వార్ మొదలై అప్పటికి రెండురోజులే ఐంది. జియోపొలిటికల్ సిట్యువేషన్‌కి జడుసుకుని గ్లోబల్ మార్కెట్లన్నీ ఢమాల్ అయ్యాయి. క్రూడాయిల్, యూఎస్ డాలర్‌తో పాటు బంగారం కూడా పైపైకే ఎగబాకింది. మరో నెలరోజుల్లో రెండులక్షల మార్కు చేరడం పక్కా అని అంచనాలూ మొదలయ్యాయి. కానీ, పుత్తడిబొమ్మ అప్పుడు ఎక్కింది మునగచెట్టు అని, ఏ నిమిషంలో ఐనా విరిగికిందకు పడొచ్చని ఆ తర్వాతే తెలిసొచ్చింది. రోజురోజుకూ నేలకు దిగి.. లక్షా 30 వేలకు అటూఇటూకి చేరింది బంగారం ధర. ఇప్పుడు మళ్లీ ఎగబాకి, నింగికి నిచ్చెనలేస్తోంది. వరుసగా రెండో రోజు భారీగా పెరిగి, కామన్ కన్‌జ్యూమర్ గుండెళ్లో గునపాలు గుచ్చేస్తోంది పసిడి మాతల్లి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 47 వేలను టచ్ చేసింది.
లక్షా 70 వేల నుంచి లక్షా 30 వేలకు పడిపోయిన ఈ నాలుగునెలల గ్యాప్‌లోనే జరగాల్సిన గడబిడ అంతా జరిగిపోయింది. పొదుపు చేసుకోకపోతే భవిష్యత్తు గల్లంతే అని ప్రధాని మోదీ ఇచ్చిన వార్నింగ్ తీవ్ర పరిణామాల్ని చూపెట్టింది. నా మాట వినండి.. ఒక్క ఏడాది పాటు ఓపిక పట్టండి.. బంగారం కొనుగోళ్లపై పాస్ బటన్ నొక్కేశారు ప్రధాని మోదీ. సూపర్ ఎల్‌నినోతో దాపురించే కరవునో, మిడిలీస్ట్ యుద్ధభయాన్నో బూచిగా చూపి కేంద్రప్రభుత్వం, కన్‌జ్యూమర్‌ని అలర్ట్ చేసింది. ఈ అడ్వైజరీ ప్రభావం నేరుగా బులియన్ మార్కెట్‌పై పడి, ముఖ్యంగా గోల్డ్‌మార్కెట్‌లో నెత్తుటేర్లు పారాయి. ఏకంగా 70 శాతం పడిపోయింది బంగారం డిమాండ్. గత ఏడాది 15 రోజుల్లో 25 టన్నుల బంగారం అమ్ముడైతే, ఈ ఏడాది జస్ట్, ఏడున్నర టన్నులే అమ్ముడైంది. అంటే నాలుగోవంతు డిమాండ్ పడిపోయినట్టేగా? సో… పొదుపు చేయాలన్న మోదీ పిలుపు బాగానే వర్కవుటైంది. కాకపోతే, పుత్తడి బజార్‌నే తలకిందులు చేస్తోందా? ఎందుకంటే, సడన్‌గా ఏర్పడ్డ ఈ నెగిటివ్ ట్రెండ్ జ్యూయెలరీ వ్యాపారుల క్యాష్ ఫ్లో మీద, సేల్స్ సైకిల్ మీద దారుణమైన ప్రభావం చూపింది. ఇక్కడ ప్రత్యక్ష నష్టం ఎవరికి అంటే చిన్న, పెద్ద నగల వ్యాపారులకే. కొనుగోళ్లు మందగించి, కొన్నిచోట్లయితే షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి.
బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం కూడా బంగారం మార్కెట్ కుంగిపోడానికి మరో మెయిన్ రీజన్. దిగుమతి ఖర్చు అమాంతం పెరిగిపోయి, సామాన్యుడికి బంగారం కొనుగోలు భారంగా మారింది. అటు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి, రూపాయి విలువ పడిపోయి సామాన్యుడి బడ్జెట్ తలకిందులైంది. రోజువారీ ఖర్చులు పెరిగి, మధ్యతరగతి, పేద కుటుంబాలు బంగారం వైపు చూడ్డమే మానేశాయి. అత్యవసరమైతే తప్ప పసిడి కొనుగోళ్లు చేయడం లేదు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అంచనాలకు అందకపోవడంతో సగటు కన్‌జ్యూమర్‌కి తిక్క పుడుతోంది. మరో మూడునెలలపాటు ఇంతేనా..? బంగారం ధరలపై ఓ స్థిరమైన ట్రెండ్ రానట్టేనా?
ఈ ఏడాది మొదటి ఆరునెలల్లోనే లెక్కలేనన్ని ఒడిదుడుకుల్ని చూసింది జ్యూయెలరీ మార్కెట్. సగానికి సగం కొనుగోళ్లు పడిపోవడంతో ఆర్నమెంట్ మార్కెట్లో ఒక చైన్ రియాక్షన్ మొదలైంది. రిటైలర్లు హోల్ సేల్ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గించారు, దీంతో హోల్‌సేలర్లు దిగుమతులు తగ్గించారు. గ్రౌండ్‌లెవల్‌లో జ్యువెలరీ వ్యాపారంపై ఆధారపడ్డ లక్షలాదిమంది స్వర్ణకారులు, పాలిష్ చేసేవాళ్ల ఉపాధి ప్రమాదంలో పడింది. 2026… బులియన్ మార్కెట్‌కి ప్రమాద నామసంవత్సరంగా చెప్పుకోవచ్చు.
ఏదైనా శుభకార్యం తలపెట్టగానే ఏ కుటుంబంలోనైనా మొదటగా చర్చకొచ్చేది బంగారం గురించే. పుట్టినరోజో, పెళ్లిరోజో వస్తోందంటే, బంగారు కానుకల గురించే మాట్లాడుకుంటాం. ఒంటిమీద నూలుపోగంతైనా నగ ఉండాల్సిందే అన్నంత గట్టిగా ముడిపడింది బంగారంతో మన బంధం. కానీ, ఇప్పుడు బంగారమే గుదిబండగా మారిందా? నిన్నమొన్నటిదాకా ఇంట్లో బంగారాన్నే కాదు, వంటిమీదున్న బంగారాన్ని కూడా గడప దాటిస్తున్నారా అన్నంత రేంజ్‌లో జరిగింది ఓల్డ్‌గోల్డ్ బిజినెస్. కొత్త బంగారం ధర అంతోఇంతో పెరిగినా, నమ్మకం లేదు దొరా అంటున్నాడు సగటు వినియోగదారుడు. ఈ రివర్స్ ట్రెండ్‌తో గోల్డ్ మార్కెట్‌పై పడబోయే ప్రభావం ఎంత?
నాలుగునెలల్లోనే ఏకంగా 40 వేలు తగ్గడంతో.. ఇంకాఇంకా తగ్గుతుందనే ఫికర్ పెరిగి, కన్‌జ్యూమర్ మైండ్‌సెట్టే మారిపోయింది. మిగతా మెటల్స్ మీదికి ఫోకస్ చేయడంతో బంగారం మీదుండే మమకారం తగ్గిపోతోందా అనిపించింది. ఎందుకంటే, ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు దాకా మూడు నెలల్లోనే 50 టన్నుల ఓల్డ్-గోల్డ్ బీరువాలు దాటి మార్కెట్లోకొచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం ఎక్కువ. దీనికి కారణాలు అనేకం. యూఎస్‌లో ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెరగడం, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల జోలికిపోకపోవడం, ఇన్వెస్టర్లలో ప్రాఫిట్ బుకింగ్ పెరగడం, ఇరాన్-అమెరికా యుద్ధ పరిస్థితిలో మార్పు రావడం.. అన్నీ కలిసి గోల్డ్ మార్కెట్‌ను కసాబిసా చేసేశాయా?
మార్కెటీర్ల అంచనా ప్రకారం మరో మూడునెలలు బంగారం మార్కెట్‌కి క్లిష్టపరిస్థితులు తప్పవు. వచ్చే ఐదేళ్లూ గోల్డ్‌మార్కెట్‌కి స్వర్ణయుగమే అనే క్లారిటీ ఐతే ఉంది. ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డా, గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. బంగారం మెరుస్తూనే ఉంటుంది. కానీ, ఎన్ని లక్షల మార్క్‌ను టచ్ చేస్తుందనే ఊహాగానాల్ని నమ్మకపోవడమే బెటర్. మిగతా దేశాలతో పోలిస్తే గోల్డ్ సెంటిమెంట్ విషయంలో మన దేశం చాలా ప్రత్యేకం. యూఎస్ డాలర్ కదలికల్ని బట్టే మన మార్కెట్ల మూడ్ ఆధారపడి ఉంటుంది. అందుకే, ఇక్కడ పసిడి ధర ఎప్పుడూ హాట్‌టాపిక్ ఔతోంది. కానీ, ఇక్కడే ఒక ఎడ్వాంటేజ్ కూడా ఉంది. కొనుగోళ్లు తగ్గి అమ్మకాలు పెరగడంతో గోల్డ్ రీ-సైక్లింగ్ మార్కెట్‌కు ఊతం దొరికినట్టయింది.
మార్కెట్‌లోకి 250 టన్నుల పాత బంగారం వస్తుందని ఒక అంచనా ఉంది. అటు, బంగారం దిగుమతులు తగ్గడం, ఇటు గోల్డ్ రీసైక్లింగ్ పెరగడం.. మొతమ్మీద మోదీ వ్యూహం ఫలించినట్టేనా అనిపిస్తోంది. మన దేశంలో ప్రైవేట్ బంగారం మొత్తం 30 వేల టన్నులు. గత మూడు నెలల్లో ఇందులో 50 టన్నులు మార్కెట్లోకొచ్చినట్టు ఇండియన్ బులియన్ జ్యూవెలరీ అసోసియేషన్ ఓ లెక్క కట్టింది. నిజానికి, ఇదేమంత ఎక్కువేమీ కాదు. అర శాతానికంటే తక్కువే. కానీ, పాత బంగారాన్ని అమ్మెయ్యాలన్న సెంటిమెంట్ ఇలాగే కంటిన్యూ ఐతే.. పరిస్థితి ఏంటి? ప్రధాని మోదీ… బంగారం కొనడం ఆపండి అన్నారు తప్ప ఉన్న బంగారాన్ని అమ్ముకోమని చెప్పలేదుగా…? మోదీ మంత్రం వికటించిందా లేక, అనుకున్నదానికంటే ఎక్కువగా పనిచేస్తోందా?
ఇండియాలో ఏటా సగటున 700 నుంచి 900 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కానీ, పసిడి ధరల్లో తిరకాసు వల్ల ఆ లెక్క దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది 620 టన్నులకు మించి అమ్ముడవకపోవచ్చు అని క్రిసిల్ అనే సంస్థ అంచనా కట్టింది. సో, మన దేశంలో పసిడి సెంటిమెంట్ కొద్దికొద్దిగా తగ్గిపోతోందనేగా అర్థం? అసలే ఇక్కడ బంగారం అంటే కేవలం పెట్టుబడి మార్గమే కాదు, ఒక బరువైన భావోద్వేగం. దాంతోనే ముడిపడ్డ జ్యూవెలరీ బిజినెస్‌కి దేశ ఆర్థిక భవిష్యత్తుని డిసైడ్ చేసే సత్తా ఉంది. మన జీడీపీలో 7 శాతానికి పైగా కంట్రిబ్యూట్ చేస్తున్న ఇండియన్ గోల్డ్ ఫీల్డ్‌లో ఇప్పుడేం జరుగుతోంది? కన్‌జ్యూమర్‌లో రివర్స్ సెంటిమెంట్ పెరిగి, రీసైక్లింగ్ బిజినెస్ ఊపందుకుంటోంది సరే.. దాని పర్యవసానాలేంటి?
ఇప్పుడైతే తులం లక్షన్నరకు అటూఇటూ కదులుతోంది పసిడి ధర. నిజానికి తులం లక్ష మార్క్‌ను టచ్ చేసినప్పుడే బంగారం కొనడం దాదాపుగా మానేశాడు సగటు వినియోగదారుడు. లక్ష అనే సౌండొచ్చిన గత ఏడాది ఏప్రిల్‌లోనే కొనుగోలు సెంటిమెంట్ సన్నగల్లింది. దానికితోడు ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం, మోదీ పొదుపు సందేశం ఇవ్వడంతో ఆ నెగిటివ్ సెంటిమెంట్ కాస్తా పీక్స్‌కి చేరిపోయింది. కొత్త బంగారం కొనడం మాట అటుంచి, పాతబంగారాన్ని బైటికి తీస్తున్నాడు. ఇదే భయపెట్టే అంశం. గతంలో, పసిడి ధరల్లో అంచనాలకందనంత మార్పుల్ని చూసిన అనుభవాలున్నాయి మార్కెట్లో. వాటితో పోలిస్తే ఇప్పటి ధరవరలు తేలికైనవే. పదిరోజుల నుంచి మహా ఐతే రెండుమూడొందలు పెరుగుతోంది, లేదా తగ్గుతోంది. ఒకరకంగా మార్కెట్లో ఇది స్టెబిలిటీ టైమ్. కానీ, ఇదే స్థిరత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందనే సందేహం వినియోగదారుణ్ణి వేధిస్తూనే ఉంది.
పండగో పబ్బమో ఏదోఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బంగారం కొనే సెక్షన్ ఒకటి. నెలకింత, ఏడాదికింత అని రెగ్యులర్‌గా బంగారం కొనే అలవాటున్న ట్రెడిషనల్ కన్‌జ్యూమర్లు కొందరుంటారు. ఇటువంటి పర్మినెంట్ కస్టమర్లను దూరం చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితిలో పడ్డాయి జ్యువెలరీ షాపులు. ‘ఎక్కువ అమ్మకాలు-తక్కువ లాభాలు’.. ఎక్కువగా ఈ కాన్సెప్ట్ మీదే ఆధారపడి జరుగుతుంది జ్యవెలరీ బిజినెస్. ఇప్పుడు కన్‌జ్యూమర్‌లో పెరిగిన నెగిటివ్ ఫీల్‌తో అమ్మకాలు ఘోరంగా తగ్గి, సగటు వర్తకుడు దారుణంగా నష్టపోతున్నాడు. డిమాండ్ పడిపోయి, మెయిన్‌టెనెన్స్ ఖర్చులు పెరిగి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. పాతబంగారాన్ని మార్చడమే తప్ప, జ్యువెలరీ షాపుల్లో ఇంకే లావాదేవీలూ జరగడం లేదు. బంగారం ధర ఇంకా తగ్గుతుందా? లక్షకు దిగొస్తుందా? ఇప్పుడు గోల్డ్ కొనవచ్చా? లేక మానేసి కొన్నాళ్లు ఎదురుచూడ్డమా? అంటే.. అందరూ భయపడుతున్నట్టు లక్షకు దిగొచ్చే ఛాన్సయితే లేదంటోంది ఇప్పుడున్న ట్రెండు.
దాదాపు 70 శాతం మందికి పైగా మధ్యతరగతి కుటుంబాలు ప్రధాని మోదీ పిలుపుతో సంబంధం లేకుండానే, కేవలం ధరల భయంతోనే కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. అటు, జనం బంగారం కొనకుండా చేయడానికి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అనే భయంతో సగటు వినియోగదారుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఇలా బంగారం డిమాండ్ పడిపోవడానికి సవాలక్ష కారణాలు. ఇదే గ్యాప్‌లో పాత బంగారాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన కూడా బలపడుతోంది.